750 కిలోల ఉల్లికి.. 1,064 రూపాయలు

3 Dec, 2018 08:20 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముంబై: పండించిన ఉల్లి పంటకు కనీస మద్దతుధర రాకపోవడంపై మహారాష్ట్రకు చెందిన ఓ రైతు వినూత్నంగా నిరసన తెలిపాడు.  నాసిక్‌ జిల్లాలోని నిఫద్‌కు చెందిన సంజయ్‌ సాథే తన పొలంలో ఉల్లి పంట వేయగా 750 కేజీల దిగుబడి వచ్చింది. దీన్ని మార్కెట్‌కు తీసుకెళ్లగా కిలో రూ.1.40 చొప్పున రూ.1,064 వచ్చాయి. నెలల పాటు కష్టపడి వ్యవసాయం చేసినప్పటికీ కనీస పెట్టుబడి దక్కకపోవడంతో సంజయ్‌ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు.

ఉల్లి అమ్మడం ద్వారా వచ్చిన మొత్తాన్ని ప్రధాని విపత్తు సహాయ నిధికి పోస్ట్‌ద్వారా పంపాడు. రైతుల కష్టాలపై కేంద్రం వైఖరికి నిరసనగానే ప్రధానికి రూ.1,064 పంపాననీ, మనీఆర్డర్‌ కోసం మరో రూ.54 ఖర్చు అయ్యాయని సంజయ్‌ వెల్లడించాడు. సాగులో సరికొత్త పద్ధతులతో భారీ దిగుబడి సాధించినందుకు 2010లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామాను సంజయ్‌ ఢిల్లీలో కలుసుకున్నాడు.   

మరిన్ని వార్తలు