‘నేతలను కొనేందుకు రైళ్లలో డబ్బు తరలిస్తున్నారు’

25 Feb, 2019 15:28 IST|Sakshi

కోల్‌కతా : బీజేపీ నేతలు తమ పార్టీ నేతలను కొనుగోలు చేసేందుకు రైళ్లలో డబ్బు తీసుకొస్తున్నారని తృణమూల్‌ కాంగ్రెస్‌ చీఫ్‌, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. తమ పార్టీ నేతలతో బీజేపీ నేరుగా బేరసారాలు జరుపుతోందని, డబ్బు ఎంత కావాలో తీసుకుని బీజేపీలో చేరిపోవాలని ప్రలోభాలకు గురిచేస్తోందని మండిపడ్డారు. తృణమూల్‌ కోర్‌ కమిటీ భేటీలో దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రైళ్లలో పెద్ద ఎత్తున నగదును బెంగాల్‌కు తరలిస్తూ ఓటర్లకు పంచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, దీనిపై తన వద్ద పక్కాగా ఆధారాలున్నాయని చెప్పారు. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఇవే చివరిరోజులని, లోక్‌సభ ఎన్నికల అనంతరం తిరిగి మోదీ సర్కార్‌ ఏర్పాటయ్యే ప్రసక్తే లేదని జోస్యం చెప్పారు. బీజేపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. పుల్వామా ఘటనను బూచిగా చూపుతూ పాకిస్తాన్‌తో యుద్ధం పేరుతో ప్రదాని మోదీ ప్రజల జీవితాలతో చెలగాటమాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

మరిన్ని వార్తలు