పత్రికలకు మార్కులు

11 Jun, 2016 03:14 IST|Sakshi
పత్రికలకు మార్కులు

ప్రకటనల మంజూరుకు కేంద్రం కొత్త విధానం
 

 న్యూఢిల్లీ: ప్రింట్ మీడియాలో వార్తాపత్రికలకు ప్రభుత్వ ప్రకటనల జారీ కోసం కేంద్ర సమాచార, ప్రసార శాఖ మార్కుల విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ప్రకటనల జారీలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం రూపొందించిన ఈ విధాన వివరాల్ని డైరక్టరేట్ ఆఫ్ అండ్ విజువల్ పబ్లిసిటీ(డీఏవీపీ) శుక్రవారం విడుదల చేసింది. వృత్తిపరంగా ఉత్తమ ప్రమాణాలు పాటిస్తూ, సర్క్యులేషన్‌ను ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్(ఏబీసీ) లేదా రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్‌పేపర్స్ ఫర్ ఇండియా (ఆర్‌ఎన్‌ఎ)తో తనిఖీ చేయించుకునే పత్రికల్ని ప్రోత్సహించేందుకు తొలిసారి ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.

మార్కుల పద్ధతిలో 6 అంశాల్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఏబీసీ/ఆర్‌ఎన్‌ఏతో సర్క్యులేషన్ తనిఖీకి(25 మార్కులు), ఉద్యోగులకు ఈపీఎఫ్  చెల్లిస్తే(20 మార్కులు), పేజీల సంఖ్యకు(20 మార్కులు), పీటీఐ/యూఎన్‌ఐ/హిందుస్తాన్ సమాచార్ వార్తా సంస్థల్లో సభ్యత్వముంటే(15 మార్కులు), సొంత ప్రింటింగ్ ప్రెస్‌కు(10 మార్కులు), పీసీఐ వార్షికసభ్యత్వ చెల్లింపునకు(10 మార్కులు) కేటాయిస్తారు. సాధించిన మొత్తం మార్కుల ఆధారంగా డీఏవీపీ ప్రకటనలు కేటాయిస్తుంది. సర్క్యులేషన్.. రోజుకు 45 వేలు మించితే ఆర్‌ఎన్‌ఐ లేదా ఏబీసీ ధ్రువీకరణ పొందాల్సి ఉండగా... 45 వేల లోపు అయితే చార్టర్డ్ అకౌంటెంట్ లేదా కాస్ట్ అకౌంటెంట్ ధ్రువీకరించాలి.

జారీ తేదీ నుంచి రెండేళ్ల వరకూ ఆర్‌ఎన్‌ఐ ధ్రువీకరణ చెల్లుబాటు అవుతుంది.  ఏబీసీ ప్రకారమైతే ప్రస్తుత ధ్రువీకరణనే సర్క్యులేషన్ సర్టిఫికెట్‌గా వాడొచ్చు. ఆర్‌ఎన్‌ఐ లేదా దాని ప్రతినిధుల ద్వారా సర్క్యులేషన్‌ను తనిఖీ చేయించుకునే హక్కు డీఏవీపీ డైరక్టర్ జనరల్‌కు ఉంటుంది. ఈ విధానం ప్రకారం వార్తాపత్రికలు, జర్నల్స్‌ను చిన్న స్థాయి(రోజుకు 25 వేల కంటే తక్కువ కాపీలు), మధ్య స్థాయి(25,001-75,000), భారీస్థాయి (రోజుకు 75వేలకు పైగా) గా విభజించారు. ప్రాంతీయ భాషా పత్రికలు, చిన్న, మధ్య స్థాయితో పాటు లక్ష కంటే ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న పత్రికలు, ఈశాన్య రాష్ట్రాలు, కశ్మీర్ వంటి ప్రాంతాల పత్రికల్ని ప్రోత్సహించేందుకు పాలసీలో వెసులుబాట్లు కల్పించారు.

మరిన్ని వార్తలు