ఆర్టికల్‌ 370 రద్దు, మాజీ సీఎంలు అరెస్ట్‌

5 Aug, 2019 20:28 IST|Sakshi

జమ్ము కశ్మీర్‌ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును రాజ్యసభలో ఆమోదించిన వెనువెంటనే జమ్ముకశ్మీర్‌లో కీలక పరిణామాలు చకాచకా చోటు చేసుకున్నాయి. మాజీ ముఖ‍్యమంత్రులు,  రాష్ట్ర కీలక నేతలను అదుపులోకి తీసుకోవడం కలకలం సృష్టించింది. ఇప్పటికే గృహ నిర‍్బంధంలో ఉంచిన మాజీ ముఖ్యమంత్రి , పీడీపీ చీఫ్‌ మెహబూబా ముఫ్తీని సోమవారం సాయంత్రం అరెస్ట్‌ చేశారు.  అనంతరం ఆమెను  శ్రీనగర్‌లోని ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌ హరినివాస్‌కు తరలించారు. ముందు  జాగ్రత్త చర్యగా  ముఫ్తీని  అరెస్ట్‌  చేసినట్టు  తెలుస్తోంది. మరో మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్‌ అబ్దుల్లా కూడా అరెస్ట్‌ చేసినట్టు సమాచారం. ఒమర్‌ అరెస్ట్‌పై అధికారిక నిర్ధారణ రావాల్సి వుంది.

జమ్మూకశ్మీర్‌కు భారీగా బలగాలను తరలించిన రోజు దగ్గరినుంచీ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ  క్రమంలో శ్రీనగర్‌లో ఆదివారం అర్ధరాత్రి నుంచి 144 సెక్షన్ విధించారు. అలాగే రాష్ట్రంలోని ముగ్గురు ప్రధాన నేతలు  పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ నేత సజాద్‌లోన్‌తో పాటు మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లాలను హౌజ్ అరెస్టు చేసిన సంగతి  తెలిసిందే. 

రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం  భారత ప్రజాస్వామ్యంలో చీకటి రోజుగా ముఫ్తీ అభివర్ణించారు.  ఇది కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమనీ, ఇది  చట్టవిరుద్ధం,  రాజ్యాంగ విరుద్ధమని ఆమె  ట్వీట్ చేశారు.

ఇది ఇలా వుంటే ఆర్టికల్ 370 రద్దుతో పాటు జమ్మూకశ్మీర్ పునర్ విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది.  సుదీర్ఘమైన చర్చ అనంతరం 370 ఆర్టికల్ రద్దు బిల్లు మూజువాణి ఓటుతో నెగ్గింది. అయితే, జమ్మూకశ్మీర్ పునర్ విభజన బిల్లుకు సవరణలుకోరిన  నేపథ్యంలో  బిల్లుపై ఓటింగ్ జరగగా.. అనుకూలంగా 125 ఓట్లు, వ్యతిరేకంగా 61 ఓట్లు రాగా ఒకరు తటస్థంగా ఉన్నారు. 

మరిన్ని వార్తలు