ఆకాశంలో మనకు అడ్డు లేదు..!

9 Jan, 2018 18:55 IST|Sakshi
రాఫెల్‌ జెట్‌కు జత చేర్చిన మెటిఒర్‌ క్షిపణి (ఫైల్‌ ఫొటో)

న్యూఢిల్లీ : రాఫెల్‌ జెట్లతో పాటు అమ్ములపొదిలో చేరనున్న మెటిఒర్‌ క్షిపణి భారత్‌ను ఆకాశంలో మళ్లీ శత్రు దుర్భేద్యంగా మార్చనుంది. రాఫెల్‌ జెట్లతో పాటు యూరోపియన్‌ మెటిఒర్‌ క్షిపణులను భారత ప్రభుత్వం ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేసింది. 150 కిలోమీటర్ల దూరంలో గల లక్ష్యాలను ఈ క్షిపణులు సునాయాసంగా చేధించగలవని పేరు చెప్పడానికి ఇష్టపడని వాయు సేన అధికారి ఒకరు తెలిపారు.

కార్గిల్‌ యుద్ధం ముగిసే వరకూ పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్‌ వద్ద మెటిఒర్‌ తరహా క్షిపణులు లేవని చెప్పారు. దీంతో సరిహద్దులో భారత వాయుసేనదే పైచేయి అయిందని తెలిపారు. వాస్తవానికి మెటిఒర్‌ క్షిపణుల ప్యాకేజికి, రాఫెల్‌ జెట్లతో ఎలాంటి సంబంధం లేదని వివరించారు. రక్షణ రంగ నిపుణుల సూచనలతో మెటిఒర్‌ క్షిపణులను విపన్‌ ప్యాకేజి కింద తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.

కార్గిల్‌ యుద్ధం సమయంలో ఫ్రెంచ్‌ ఎస్‌530డీ, రష్యన్‌ ఆర్‌వీవీ ఏఈ క్షిపణులను ఉపయోగించి భారత్‌ పాకిస్తాన్‌ను దెబ్బకొట్టినట్లు వెల్లడించారు. ఈ క్షిపణులను ఉపయోగించి పాకిస్తాన్‌ను తన జెట్ల ఫ్లీట్‌ను ఉపయోగించకుండా చేసినట్లు తెలిపారు. అయితే, యుద్ధం అనంతరం పాకిస్తాన్‌ తన ఎఫ్‌-16 జెట్లకు 100 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించగల ఏఐఎమ్‌120-సీ5లను అమర్చినట్లు వెల్లడించారు.

దీంతో పాకిస్తాన్‌ వాయుసేన బలపడిందని తెలిపారు. మెటిఒర్‌ రాకతో మళ్లీ ఆసియాలో భారత వాయుసేన దుర్భేద్యంగా తయారవుతుందని చెప్పారు. మెటిఒర్‌ క్షిపణిని ఇంతవరకూ ఏ ఇతర జెట్‌తోనూ ఇంటిగ్రేట్‌ చేయకపోవడం భారత్‌కు కలిసొచ్చిందని తెలిపారు. అమెరికా, పాకిస్తాన్‌, చైనా జెట్లకు మెటిఒర్‌ను అనుసంధానించలేదని వెల్లడించారు. ఫ్రాన్స్‌తో చేసుకున్న ఒప్పందం ప్రకారం రాఫెల్ జెట్లు వచ్చే ఏడాది ప్రథమార్థంలో భారతీయ వాయుసేన చేతికి అందనున్నాయి.

మరిన్ని వార్తలు