కరోనా టెస్ట్‌ల సంఖ్య పరిమితమే..

27 Apr, 2020 15:08 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారికి లాక్‌డౌన్‌ అమలుతో పాటు ప్రభుత్వం చేపట్టిన పలు చర్యలను వివరిస్తూ హోంమంత్రిత్వ శాఖ సోమవారం సర్వోన్నత న్యాయస్ధానానికి స్టేటస్‌ రిపోర్ట్‌ సమర్పించింది. ఏప్రిల్‌ 12 వరకూ చేపట్టిన చర్యలతో కూడిన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ ఏడాది జనవరిలో ఒకే ఒక్క ల్యాబ్‌ అందుబాటులో ఉండగా ఏప్రిల్‌ 9 నాటికి కరోనా వైరస్‌ టెస్టులు చేయతగిన సామర్ధ్యంతో కూడిన 139 ల్యాబ్‌లు దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయని ఈ నివేదికలో పేర్కొంది. ఇక గత మార్చి 31న హోంమంత్రిత్వ శాఖ దాఖలు చేసిన అఫిడవిట్‌లో 118 టెస్టింగ్‌ ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది.

మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 9 వరకూ పలు ల్యాబ్‌లు అందుబాటులోకి వచ్చినా కరోనా పరీక్షల సామర్థ్యం రెండు నివేదికల్లోనూ రోజుకు 15,000 టెస్ట్‌లుగానే పేర్కొనడం గమనార్హం. దేశంలో తొలి కోవిడ్‌-19 కేసు నమోదైనప్పటి నుంచీ టెస్టింగ్‌ సామర్థ్యం గణనీయంగా పెరిగిందని తాజా అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది. ప్రభుత్వ నివేదికలను పరిశీలిస్తే ప్రభుత్వ లేబొరేటరీలతో పాటు ప్రైవేట్‌ ల్యాబ్‌ల్లోనూ టెస్టింగ్‌ సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చినట్టు వెల్లడైంది. మార్చి 31న దాఖలైన అఫిడవిట్‌లో 47 ప్రైవేట్‌ ల్యాబ్‌లను టెస్ట్‌ల కోసం అనుమతిస్తున్నట్టు పేర్కొనగా, ఏప్రిల్‌ 9న ప్రైవేట్‌ ల్యాబ్‌ల సంఖ్య 67గా పేర్కొన్నారు. అయితే రోజువారీ కరోనా పరీక్షల సంఖ్యలో మాత్రం పెరుగుదల చోటుచేసుకోలేదు. ఇక 52,094 వెంటిలేటర్లకు ఆర్డరిచ్చామని, వీటిలో 10,500 వెంటిలేటర్లు ఏప్రిల్‌ 30 నాటికి, 18,000 వెంటిలేటర్లు మే 30 నాటికి సరఫరా అవుతాయని, 20,000కు పైగా వెంటిలేటర్లు జూన్‌ 30 నాటికి సరఫరా అవుతాయని కోర్టుకు సమర్పించిన నివేదికలో కేంద్రం పేర్కొంది.

చదవండి : ఆర్నాబ్ గోస్వామికి సుప్రీంలో ఊర‌ట‌

మరిన్ని వార్తలు