డాక్టర్‌ అందుబాటులో లేకపోవడంతో దారుణం..!

2 Sep, 2019 13:20 IST|Sakshi

గువాహటి : అసోంలోని టియోక్‌ టీ ఎస్టేట్‌లో డాక్టర్‌ అందుబాటులో లేకపోవడంతో సోమ్రా మాఝి (33) అనే మహిళా కార్మికురాలు మృతి చెందింది. దాంతో ఆమె కుటుంబ సభ్యులు, తోటి కార్మికులు సదరు మహిళ మృతికి డాక్టరే కారణమంటూ ఆగ్రహావేశాలకు లోనయ్యారు. డాక్టర్‌ దేవెన్‌ దత్తా (73) ఆస్పత్రికి చేరుకోగానే దాదాపు 250 మంది మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారు. అయితే, టీతోటలో ఘర్షణపూరిత వాతావరణం నెలకొందని తెలుసుకున్న పోలీసులు ఆయనకు రక్షణ కల్పించారు. కానీ, అప్పటికే సమయం మించిపోయింది.

మూక దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలిస్తుండగా డాక్టర్‌ దేవెన్‌ దత్తా మార్గమధ్యంలో మృతి చెందారు. ఈ ఘటన గత శనివారం జోర్హాత్‌ జిల్లాలో చోటుచేసుకుంది. డాక్టర్‌పై దాడికి పాల్పడ్డ 21 మందిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. డాక్టర్‌ దేవెన్‌ దత్తాపై జరిగిన అమానుష దాడితో వైద్య సంఘాలు భగ్గుమన్నాయి. రిటైర్‌ అయ్యాక కూడా ప్రజలకు సేవ చేస్తున్న సీనియర్‌ డాక్టర్‌కు ఇలాంటి గతి పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఇండియన్‌ మెడికల్‌ అసోషియేషన్‌ మంగళవారం బంద్‌కు పిలుపునిచ్చింది. అత్యవసర సేవల్ని కూడా నిలుపుదల చేస్తున్నామని ప్రకటించింది.

మరిన్ని వార్తలు