ఇక సినిమా హాలు మీ ఊరికే..

10 May, 2018 19:21 IST|Sakshi
మొబైల్‌ థియేటర్‌లో సినిమా చూస్తున్న ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌

సాక్షి, న్యూఢిల్లీ : సినిమా హాలు ఏంటి? మన ఊరికి రావడమేంటని అనుకుంటున్నారా?. ఇప్పటివరకూ మనం మొబైల్‌ ఆస్పత్రులు, క్యాంటీన్లను మాత్రమే చూసుంటాం. కొత్తగా మొబైల్‌ సినిమా హాలు దేశ రాజధాని న్యూఢిల్లీలో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ చేతుల మీదుగా ప్రారంభమైంది. ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత సతీష్‌ కౌశిక్‌, పారిశ్రామికవేత్త సునీల్‌ చౌదరి  ‘పిక్చర్‌ టైం’ బ్రాండ్‌ పేరుతో ఈ సదుపాయాన్ని తీసుకొచ్చారు.

ఓ కంటెయినర్‌, బెలూన్‌ లాంటి పెద్ద టెంటు సాయంతో దీన్ని ఏర్పాటు చేస్తారు. 60x30 అడుగుల వైశాల్యంలో ఉండే ఈ తాత్కాలిక థియేటర్‌లో సుమారు 200 సీట్లు ఉంటాయి. వర్షాలు, అగ్నిప్రమాదాలను తట్టుకొని నిలిచే మెటీరియల్‌తో దీన్ని తయారు చేశారు. ఏసీ సదుపాయం కూడా ఉంది. డిమాండ్‌ ఉన్న ప్రాంతాల్లో అప్పటికప్పుడు ఈ థియేటర్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.

సినిమా హాలుకు దూరంగా ఉన్న మారుమూల గ్రామాలకు దీంతో మేలు జరుగుతుంది. ప్రస్తుతానికి ఇలాంటి యూనిట్లు 10 వరకు అందుబాటులో ఉన్నాయని, ఈ ఏడాది చివరకు వీటి సంఖ్యను 150కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని నిర్వాహకులు తెలిపారు. సినిమా స్థాయిని బట్టి టికెట్టు ధర 30-60 రూపాలయల వరకు ఉంటుందని వారు తెలిపారు.

మరిన్ని వార్తలు