'ధరలు తగ్గాయనడం ఈ శతాబ్దంలోనే పెద్ద జోక్‌'

30 May, 2015 02:33 IST|Sakshi
'ధరలు తగ్గాయనడం ఈ శతాబ్దంలోనే పెద్ద జోక్‌'

విచారణ సంస్థలకు సారథులే లేరు
మోదీకి రాహుల్ జపం ఎందుకు
రాష్ట్రంలో దొంగల ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్: ఏడాది నరేంద్రమోదీ పాలనలో ధరలు నియంత్రించామంటూ పచ్చి అబద్ధాలను ప్రచారాలు చేస్తున్నారని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ విమర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు వయలార్ రవి, ఆర్.సి.కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీతో కలసి ఆయన శుక్రవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఏడాది పాలనపై దేశ ప్రజలకు ప్రధాని మోదీ రాసిన బహిరంగలేఖలోనూ అన్ని అబద్ధాలేనని ఆరోపించారు. ధరలు తగ్గాయనడం ఈ శతాబ్దంలోనే పెద్ద జోక్‌గా ఆజాద్ అభివర్ణించారు.
 
 అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు తగ్గినా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించకుండా, ప్రజలపై భారాన్ని మోపుతూనే ఉన్నారని దుయ్యబట్టారు. ఏడాది పాలన అవినీతిరహితమని చెప్పుకోవడం ఆత్మవంచనే అని విరుచుకుపడ్డారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సమాచారహక్కు కమిషన్ వంటి కీలకమైన విచారణ సంస్థలకు సారథులే లేకుంటే అవినీతి ఎలా బయటపడుతుందని ప్రశ్నిం చారు. రాష్ట్రాలతో కలసి పనిచేస్తామంటూనే రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాల్లేకుండా అణిచేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాహుల్‌గాంధీని చూసి మోదీ భయపడుతున్నారని, అందుకే మోదీ ప్రతిరోజూ రాహుల్  జపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
 
వ్యవసాయంపై నిర్లక్ష్యం
వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, రైతులను కష్టనష్టాల పాల్జేసిన ఘనత మాత్రం మోదీ ప్రభుత్వానికే దక్కుతుందని ఆజాద్ వ్యాఖ్యానించారు. భూసేకరణ బిల్లు విషయం లో దేశం అంతా వ్యతిరేకించినా మోదీ మొం డిగా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో దొంగలపాలన సాగుతున్నదని ఆజాద్ వ్యాఖ్యానించారు. ప్రజల ఓట్లతో గెలి చిన ఎమ్మెల్యేలను దొంగల్లాగా ఎత్తుకొని పోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. ఇక్కడి అధికారపార్టీ దొంగలా వ్యవహరిస్తున్నందునే తాము పరిశీలనకు రావాల్సి వచ్చిందని ఆజాద్ వెల్లడించారు.
 
నేరేళ్ల శారద బాధ్యతల స్వీకరణ
పీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా నియమితురాలైన నేరేళ్ల శారద శుక్రవారం గాంధీభవన్‌లో బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆజాద్ మాట్లాడుతూ,  కాంగ్రెస్ పార్టీలో మహిళలకు సముచిత ప్రాధాన్యత ఉంటుందని   చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంలో మహిళలకు ప్రాతినిధ్యం లేదని, మహిళలపై వివక్షను చూపించే ప్రభుత్వంపై మహిళల హక్కుల కోసం పోరాడాల్సి ఉందన్నారు. సీఎం అతిపెద్ద మాంత్రికుడని దుయ్యబట్టారు.

మరిన్ని వార్తలు