ఓటాన్‌ అకౌంట్‌కే మొగ్గు : బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి స్పష్టత

30 Jan, 2019 14:25 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల ఏడాది ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు బదులు నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిస్ధాయి బడ్జెట్‌ ప్రవేశపెడుతుందనే వార్తలను ప్రభుత్వం తోసిపుచ్చింది. ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 2019-20 సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడతామని ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ బుధవారం జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

సాధారణంగా ఎన్నికల ఏడాది మధ్యంతర బడ్జెట్‌ లేదా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టడం ఆనవాయితీ.ఎన్నికల అనంతరం కొలువుతీరే ప్రభుత్వం పూర్తిస్ధాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. ఎన్నికలకు ముందు పరిమిత కాలానికి ప్రభుత్వ వ్యయానికి సంబంధించి అనుమతి అవసరం కావడంతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రభుత్వం కొద్దినెలల కాలానికి ప్రవేశపెడుతుంది.

కాగా,ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వైద్య చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లడంతో గత వారం ఆర్థిక మంత్రిగా అదనపు బాధ్యతలు చేపట్టిన పీయూష్‌ గోయల్‌ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక శాఖ సహాయమంత్రులు పొన్‌ రాధాకృష్ణన్‌, శివ్‌ ప్రతాప్‌ శుక్లాలు ఇటీవల హల్వా వేడుకతో బడ్జెట్‌ కసరత్తును ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా ఫిబ్రవరి చివరిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సం‍ప్రదాయానికి మోదీ సర్కార్‌ స్వస్తిపలుకుతూ ఫిబ్రవరి ఒకటవ తేదీనే బడ్జెట్‌ ప్రవేశపెడుతుండటంతో ఏప్రిల్‌లో నూతన ఆర్థిక సంవత్సరం ఆరంభానికే మంత్రిత్వ శాఖలు తమ కేటాయింపులు పొందేలా కార్యాచరణ రూపొందించుకునే వెసులుబాటు ఏర్పడింది.

మరిన్ని వార్తలు