India-US Relations: అంకురాలకు దన్ను

16 Nov, 2023 04:42 IST|Sakshi

కొత్త ఆవిష్కరణలకు ప్రోత్సాహం

భారత్, అమెరికా మధ్య ఒప్పందం

న్యూఢిల్లీ: అంకుర సంస్థల మధ్య సహకారాన్ని పెంపొందించే దిశగా భారత్, అమెరికా ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. నవకల్పనలకు ఊతమిచ్చేందుకు, నిధుల సమీకరణలో ఎంట్రప్రెన్యూర్లు పాటించే విధానాలను పరస్పరం పంచుకునేందుకు, నియంత్రణపరమైన సమస్యల పరిష్కార మార్గాలను కనుగొనేందుకు ఇది తోడ్పడనుంది.

ఇరు దేశాల పరిశ్రమవర్గాల రౌండ్‌టేబుల్‌ సమావేశం సందర్భంగా ఎంవోయూ కుదిరినట్లు కేంద్ర వాణిజ్య, పరిశమ్రల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే, ఆర్థిక కార్యకలాపాలు, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనపై ఇది సానుకూల ప్రభావం చూపగలదని వివరించింది.  కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్, అమెరికా వాణిజ్య మంత్రి జినా రైమండో నేతృత్వం వహించిన ఈ సమావేశంలో పలువురు భారతీయ వ్యాపారవేత్తలు, టెక్నాలజీ దిగ్గజాల సీఈవోలు, వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థల ప్రతినిధులు, స్టార్టప్‌ల వ్యవస్థాపకులు పాల్గొన్నారు.

ఇరు దేశాల మధ్య సాంకేతిక సహకారాన్ని పెంపొందించుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. భారత్‌–అమెరికా వాణిజ్య చర్చల కింద రూపొందించిన ఇండియా–యూఎస్‌ ఇన్నోవేషన్‌ హ్యాండ్‌õÙక్‌ కాన్సెప్టును ఈ సందర్భంగా గోయల్, రైమండో ఆవిష్కరించారు. డీప్‌ టెక్నాలజీ, క్రిటికల్‌ టెక్నాలజీ వంటి విభాగాల్లో సహకారాన్ని పటిష్టం చేసుకునేందుకు రెండు దేశాల నిబద్ధతకు ఎంవోయూ నిదర్శనంగా నిలుస్తుందని గోయల్‌ పేర్కొన్నారు. దీని కింద వచ్చే ఏడాది తొలినాళ్లలో భారత్, అమెరికాలో ఇన్నోవేషన్‌ హ్యాండ్‌õÙక్‌ ఈవెంట్లను నిర్వహించనున్నారు.

మరిన్ని వార్తలు