రానున్న దశాబ్ధంలో యువతే కీలకం..

29 Dec, 2019 12:20 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రానున్న దశాబ్ధంలో యువ భారతం కీలక పాత్ర పోషిస్తుదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నేటి యువత వ్యవస్ధ పట్ల అవగాహనతో ఉన్నారని, పలు అంశాలపై స్ధిరమైన అభిప్రాయం కలిగి ఉన్నారని ఆయన పేర్కొన్నారు. బంధుప్రీతి, నియంతృత్వం, అస్ధిరతలను యువత ఇష్టపడటం లేదని మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రధాని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్ధులు, యువత ఆందోళనలు చేపట్టిన క్రమంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

వ్యవస్ధలో లోపాలను ప్రశ్నిస్తూ విద్యార్ధులు చైతన్యం ప్రదర్శించడం స్వాగతించదగిన పరిణామమని వ్యాఖ్యానించారు. దేశ పురోగతిలో యువత పలు మార్గాల్లో పాలుపంచుకోవచ్చని ప్రధాని సూచించారు. బిహార్‌లోని పశ్చిమ చంపరాన్‌ జిల్లాలో భైరవ్‌గంజ్‌ హెల్త్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్ధులు పరిసర గ్రామాల ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు అందిస్తున్నారని ప్రధాని కొనియాడారు. జమ్ము కశ్మీర్‌లో యువత ఆధ్వర్యంలో సాగుతున్న నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పనా కార్యక్రమం గురించి సైతం ఆయన ప్రస్తావించారు. కాగా ఈ ఏడాదిలో ప్రధాని మోదీ చివరి మన్‌ కీ బాత్‌ కార్యక్రమం ఇదే కావడం గమనార్హం.

>
మరిన్ని వార్తలు