ఇంతింత కాదయా...ఇంటి కాలుష్యం

6 Nov, 2017 01:16 IST|Sakshi

మూసుకుపోతున్న శ్వాసనాళాలు.. స్వేచ్ఛగా గాలి పీల్చలేకపోతున్న నగరవాసులు

ఇంటర్నల్‌ పొల్యూషన్‌.. చలిగాలులే కారణం 

గ్రేటర్‌లో 5–8 శాతం మందిలో శ్వాస సంబంధ సమస్యలు 

చలి తీవ్రతతో మరింత పెరుగుతున్న ఆస్తమా కేసులు 

ఆసియా పసిఫిక్‌ ఆస్తమా ఇన్‌సైట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ అధ్యయనంలో వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: ఇంట్లో, పనిచేసే చోట ఘాటైన వాసనలను పీల్చడం.. పెంపుడు జంతువుల వెంట్రుకలు.. దుప్పట్లు, దిండ్లపై ఉండే దుమ్ము.. మస్కిటో కాయిల్స్, సువాసన కోసం వాడే పెర్‌ఫ్యూమ్‌లు, పుప్పొడి రేణువులు, ధూమపానం.. అంతర్గత కాలుష్యానికి ఇవే ప్రధాన కారణాలట. ఆస్ప్రిన్, బీటాబ్లాకర్స్‌ వంటి మందులు వాడటం.. బొద్దింకలు, ఎలుకల మలమూత్రాల నుంచి వెలువడే రసాయనాలు కూడా అంతర్గత కాలుష్యానికి కారణమవుతున్నాయట. పారిశ్రామిక, వాహన కాలుష్యంతో పోలిస్తే.. ఇంట్లో వెలువడే కాలుష్యమే శ్వాసనాళాలపై ఎక్కువ ప్రభావం చూపుతోందని ఆసియా పసిఫిక్‌ ఆస్తమా ఇన్‌సైట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (ఇండియా) సంస్థ నిర్వహించిన తాజా అధ్యయనం స్పష్టం చేస్తోంది.

ఈ సంస్థ ఇటీవల దేశవ్యాప్తంగా అహ్మదాబాద్, నాగపూర్, ముంబై, చండీఘర్, సిమ్లా, గువాహటి, కోల్‌కతా, మైసూర్, తిరువనంతపురం, చెన్నై, సికింద్రాబాద్‌ తదితర నగరాల్లో శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న రోగులపై సర్వే నిర్వహించింది. 85 వేల మంది పురుషులు, 85 వేల మంది మహిళలపై ఈ సర్వే చేసింది. ఇతర నగరాలతో పోలిస్తే గ్రేటర్‌లోనే శ్వాస సంబంధ బాధితులు ఎక్కువగా ఉన్నట్లు ఈ సర్వే పేర్కొంది. నగరంలో ఇప్పటికే పెద్దల్లో 5–8 శాతం మంది శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతుంటే.. చిన్నారుల్లో 10–12 శాతం మంది ఇబ్బందులు పడుతున్నారని వెల్లడైంది. అంతర్గత కాలుష్యానికి ప్రస్తుతం వీస్తున్న చలిగాలులు తోడవడంతో ఆస్తమా, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్న రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని తెలిపింది. 

వీటితోనూ ముక్కుకు ముప్పే.. 
గ్రేటర్‌లో 15 ఏళ్ల క్రితం 11 లక్షల వాహనాలు ఉండగా, ప్రస్తుతం ఈ సంఖ్య 50 లక్షలకు చేరింది. ఇందులో పదిహేనేళ్ల సర్వీసు దాటిన వాహనాలు ఐదు నుంచి పది లక్షలు ఉన్నాయి. వీటికి తోడు మరో 40 వేల పరిశ్రమలు కూడా ఉన్నాయి. వీటి నుంచి వెలువడుతున్న కాలుష్యం వల్ల ఓజోన్‌ లెవల్స్‌ ఫర్‌ క్యూబిక్‌ మీటర్‌ గాలిలో 130–150 మైక్రో గ్రాములకుపైగా నమోదవుతోంది. సల్ఫర్‌ డయాక్సైడ్, హైడ్రోకార్బన్స్, నైట్రోజన్‌ ఆక్సైడ్, అమ్మోనియం, కార్బోమోనాక్సైడ్‌ వంటి రసాయనాలు సైతం శ్వాసనాళాల పనితీరును దెబ్బతీస్తున్నాయి.

ఒక కాయిల్‌.. 90 సిగరెట్లతో సమానం.. 
దోమల నుంచి రక్షణ కోసం చాలామంది మస్కిటో కాయిల్స్‌ వాడుతున్నారు. ఒక మస్కిటో కాయిల్‌ 90 సిగరెట్లు వెదజల్లే పొల్యూషన్‌తో సమానం. ఈ గాలి నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరడంతో శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. నాడీ వ్యవస్థ దెబ్బతినడంతో పాటు కంటిచూపు మందగిస్తుంది. ఊపిరితిత్తుల జీవితకాలం కూడా తగ్గుతుంది. మస్కిటో కాయిల్స్‌కు బదులు ఫ్యాన్‌ వాడటం ఉత్తమం. 
    – డాక్టర్‌ పి.సుదర్శన్‌రెడ్డి, చిన్నపిల్లల వైద్యనిపుణుడు 

ఘాటైన వాసనలకు దూరంగా ఉండాలి.. 
సువాసన కోసం వాడే కొన్ని రకాల పెర్‌ఫ్యూమ్‌లు, మస్కిటో కాయిల్స్‌ ఘాటైన వాసన వెదజల్లుతాయి. ఇవి శ్వాస నాళాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. సాధ్యమైనంత వరకు తక్కువ ఘాటు ఉన్న పెర్‌ఫ్యూమ్‌లనే వాడాలి. కుక్కలు, పిల్లులు, ఇతర పెంపుడు జంతువులను ఇంటి బయటే ఉండేలా చూసుకోవాలి. కార్పెట్లు, పరుపులు, దిండ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ఐస్‌క్రీమ్‌లు, శీతల పానీయాలు, కూలర్, ఏసీ, సిగరెట్, సిమెంట్, ఫ్లెక్సీ ప్రింటర్ల నుంచి వెలువడే వాసనలకు దూరంగా ఉండటం వల్ల శ్వాస సంబంధ సమస్యల నుంచి బయటపడొచ్చు.   
 – డాక్టర్‌ విజయ్‌కుమార్, శ్వాసకోశ వైద్యనిపుణుడు 

మరిన్ని వార్తలు