క్యాన్సర్‌ రోగినీ వదలని మోసగాడు! | Sakshi
Sakshi News home page

క్యాన్సర్‌ రోగినీ వదలని మోసగాడు!

Published Mon, Nov 6 2017 1:21 AM

Online scams also to cancer patient - Sakshi

పెద్దపల్లి: ఆన్‌లైన్‌ మోసాలు చేసేవాళ్లు చివరకు రోగులను కూడా వదలడం లేదు. క్యాన్సర్‌తో బాధ పడుతూ ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న జోయల్‌ అనే కానిస్టేబుల్‌ దీనగాధ తెలిసిందే. ఓ ప్రబుద్ధుడు జోయల్‌కు ఫోన్‌చేసి తాను డీఎస్పీ అమర్‌నాథ్‌రెడ్డిగా పరిచయం పెంచుకుని రూ.14,500 ఆన్‌లైన్‌లో పంపిస్తే నీ ఆరోగ్య పరిరక్షణ కోసం రూ.5 లక్షల చెక్కు పంపిస్తామని చెప్పడంతో సదరు రోగి మోసపోయాడు. ‘మరణశయ్యపై కానిస్టేబుల్‌’ శీర్షికన ‘సాక్షి’లో గత నెల 28న ప్రచురితమైన కథనానికి స్పందించి సాటి కానిస్టేబుళ్లు రూ.55 వేల వరకు జోయల్‌ ఖాతాలో జమ చేశారు.  డీజీపీ కార్యాలయం నుంచి రూ.4 లక్షల విలువైన మందులు అందించారు.  

ఈ నెల 2న తాను డీఎస్పీ అమర్‌నాథ్‌రెడ్డిని అని జోయల్‌కు ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. ‘మీ కష్టం తెలుసుకున్నా.. సహాయం చేయాలని డీజీపీతో మాట్లాడాను. సీఎం సరేనంటూ రూ.5 లక్షలు సహాయ నిధి నుంచి విడుదల చేశారు’అని నమ్మబలి కాడు. ఓ ఖాతా నంబర్‌ ఇచ్చి అందులో రూ.14,500 వేస్తే రూ.5 లక్షల చెక్కు మంజూరవుతుందని చెప్పాడు. నమ్మిన జోయల్‌ అతడు చెప్పిన ఖాతాలో ఆ మొత్తం గురువారం జమ చేశాడు.  మరుసటి రోజు రూ.5 లక్షల చెక్కు కోసం ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ వస్తోంది. ఆ తర్వాత ఫోన్‌చేస్తే సిమ్‌కార్డు తొలగించినట్లు వాయిస్‌.. దీంతో మోసపోయానని ఆందోళన చెందుతున్నాడు. కాగా, సదరు అమర్‌నాథ్‌రెడ్డి సెల్‌ఫోన్‌ నంబర్, వాట్స్‌యాప్‌ డీపీలో ఓ పోలీస్‌ అధికారి ఫోటో కనిపించడం విశేషం. ఎవరా అధికారి అనేది మాత్రం పోలీసులే తేల్చాల్సి ఉంది. 

Advertisement
Advertisement