చెట్టెక్కిన కేంద్ర మంత్రి.. ఎందుకో తెలుసా?

5 Jun, 2017 14:03 IST|Sakshi
చెట్టెక్కిన కేంద్ర మంత్రి.. ఎందుకో తెలుసా?

ఆయన స్వయానా కేంద్రంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి. అంతటి పెద్దమనిషి తన సొంత రాష్ట్రంలో.. తన సొంత నియోజకవర్గంలో ప్రజల సమస్యలను పరిష్కరించడానికి చెట్టు ఎక్కాల్సి వచ్చింది. అదేంటి, మంత్రిగారు చెట్టు ఎక్కడం ఏంటని అనుకుంటున్నారా.. అయితే చదవండి. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సొంత రాష్ట్రం రాజస్థాన్. అక్కడ ఆయన నియోజకవర్గం బికనీర్. ఆ నియోజవకర్గం పరిధిలోని ఢోలియా అనే గ్రామంలో కొన్ని సమస్యలు ఉండటంతో వాటి పరిష్కారం కోసం ఆయన అక్కడకు వెళ్లారు. గ్రామంలోని ఆస్పత్రిలో నర్సులు తగినంతగా లేరని స్థానికులు ఆయనకు మొరపెట్టుకున్నారు. దాంతో సంబంధిత ఉన్నతాధికారికి వెంటనే ఫోన్ చేసి, సమస్యను పరిష్కరిద్దామని కేంద్రమంత్రి మేఘ్వాల్ అనుకున్నారు.

అనుకున్నదే తడవుగా జేబులోంచి సెల్‌ఫోన్ తీశారు. కానీ తీరాచూస్తే అందులో సిగ్నల్ ఒక్క పాయింటు కూడా లేదు. ఇదేంటని అక్కడ ఉన్నవాళ్లను అడిగితే, ఈ గ్రామంలో సెల్‌ఫోన్ మాట్లాడాలంటే చెట్టు ఎక్కాల్సిందేనని చావుకబురు చల్లగా చెప్పారు. అదేంటని అడిగితే.. దగ్గరలో సెల్‌టవర్ లేదని, అందువల్ల చెట్టు ఎక్కితే దూరంగా ఉన్న టవర్ నుంచి సిగ్నల్ అందుతుందని వివరించారు. చేసేది లేక తాను కూడా చెట్టు ఎక్కడానికి మేఘ్వాల్ సిద్ధపడ్డారు. అయితే పెద్ద వయసు కావడంతో ఆయన కోసం వెంటనే అక్కడున్నవాళ్లు ఒక నిచ్చెన తెప్పించారు. దాని సాయంతో ఆయన చెట్టెక్కి, ఫోన్ మాట్లాడి అప్పుడు కిందకు వచ్చారు. అదీ కేంద్ర మంత్రి గారి చెట్టు కథ.

మరిన్ని వార్తలు