Sakshi News home page

Womens Reservation Bill 2023: మహిళా బిల్లుకు జై

Published Thu, Sep 21 2023 2:25 AM

Womens Reservation Bill 2023: Lok Sabha passes historic womens reservation Bill - Sakshi

న్యూఢిల్లీ: లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్‌ బిల్లును లోక్‌సభ దాదాపు ఏకగ్రీవంగా ఆమోదించింది. రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించిన రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 368(2) ప్రకారం ఈ బిల్లు ఆమోదం పొందింది. దీనిప్రకారం సభలోని మొత్తం సభ్యుల్లో మూడింట రెండొంతుల మంది మద్దతు తెలపాల్సి ఉంటుంది.

పార్టీలకు అతీతంగా సభ్యులు బిల్లుకు జై కొట్టారు. పార్లమెంట్‌ నూతన భవనంలో ఆమోదం పొందిన మొట్టమొదటి బిల్లు ఇదే కావడం విశేషం. ‘నారీశక్తి వందన్‌ అధినియమ్‌’ పేరిట కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ ఈ నెల 19న లోక్‌సభలో ప్రవేశపెట్టిన ‘రాజ్యాంగ(128వ సవరణ) బిల్లు–2023’పై బుధవారం దాదాపు 8 గంటలపాటు సుదీర్ఘంగా చర్చ జరిగింది. కేంద్ర మంత్రి అమిత్‌ షా, కాంగ్రెస్‌ ఎంపీ సోనియా గాంధీ సహా వివిధ పార్టీలకు చెందిన దాదాపు 60 మంది సభ్యులు మాట్లాడారు. కొందరు బిల్లుకు మద్దతుగా ప్రసంగించారు. మరికొందరు మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళా కోటా గురించి ప్రశ్నించారు.

ఈ రిజర్వేషన్లను వెంటనే అమల్లోకి తీసుకురావాలన్న డిమాండ్లు సైతం వినిపించాయి. చర్చ అనంతరం స్పీకర్‌ ఓం బిర్లా ఓటింగ్‌ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 454 మంది సభ్యులు ఓటు వేయగా, ఇద్దరు ఎంపీలు వ్యతిరేకంగా ఓటేశారు. ఓటింగ్‌ ప్రక్రియలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. చర్చ అనంతరం అదే రోజు ఓటింగ్‌ నిర్వహిస్తారు. ఎగువ సభలోనూ బిల్లు ఆమోదం పొందడం లాంఛనమే. అనంతరం రాష్ట్రపతి సంతకంతో మహిళా రిజర్వేషన్‌ బిల్లు చట్టరూపం దాల్చనుంది. జన గణన, నియోజకవర్గాల పునర్విభజన పూర్తయిన తర్వాత 2029 నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.

ఓటింగ్‌ జరిగిందిలా..
మహిళా రిజర్వేషన్‌ బిల్లు విషయంలో రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉండటంతో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా స్లిప్‌ల ద్వారా ఓటింగ్‌ నిర్వహించారు. మాన్యువల్‌ పద్ధతిలో ఓటింగ్‌ జరిగింది. ఎరుపు, ఆకుపచ్చ రంగు స్లిప్‌లను సభ్యులకు అందజేశారు. ఓటు ఎలా వేయాలో లోక్‌సభ సెక్రెటరీ జనరల్‌ వివరించారు. బిల్లుకు మద్దతు తెలిపితే ఆకుపచ్చ స్లిప్‌పై ‘ఎస్‌’ అని రాయాలని, వ్యతిరేకిస్తే ఎరుపు రంగు స్లిప్‌పై ‘నో’ అని రాయాలని చెప్పారు. ఆ ప్రకారమే ఓటింగ్‌ జరిగింది. బిల్లుకు మద్దతుగా 454 ఓట్లు, వ్యతిరేకంగా కేవలం 2 ఓట్లు వచ్చాయి. ఈ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా ఏఐఎంఐంఎ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ప్రకటించారు. ఆ పార్టీకి లోక్‌సభలో ఓవైసీతోపాటు మరో ఎంపీ సయ్యద్‌ ఇంతియాజ్‌ జలీల్‌(ఔరంగాబాద్‌) ఉన్నారు. బిల్లుకు వ్యతిరేకంగా వారిద్దరూ ఓటేసినట్లు తెలుస్తోంది.

చాలా సంతోషంగా ఉంది: ప్రధాని మోదీ
మహిళా రిజర్వేషన్‌ బిల్లు లోక్‌సభలో భారీ మెజార్టీతో ఆమోదం పొందడం చాలా సంతోషంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా బిల్లుకు మద్దతు ఇచ్చిన ఎంపీలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు మోదీ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. నారీశక్తి వందన్‌ అధినియమ్‌ ఒక చరిత్రాత్మక చట్టం అవుతుందన్నారు. ఈ చట్టంతో మహిళా సాధికారతకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని, మన రాజకీయ వ్యవస్థలో మహిళామణుల భాగస్వామ్యం ఎన్నో రెట్లు పెరుగుతుందని ప్రధానమంత్రి తెలిపారు.  
 
ప్రస్తుతం రాజీవ్‌ గాంధీ కల సగమే నెరవేరింది. బిల్లు చట్టరూపం దాల్చాకే ఆయన కల నెరవేరుతుంది. నాదో ప్రశ్న. మహిళలు తమ రాజకీయ బాధ్యతలు నెరవేర్చుకునేందుకు గత 13 ఏళ్లుగా వేచిచూస్తున్నారు. ఇంకా మనం వాళ్లని రెండేళ్లు, నాలుగేళ్లు, ఆరేళ్లు, ఎనిమిదేళ్లు వేచి ఉండండని చెబుదామా? భారతీయ మహిళల పట్ల ఇలా ప్రవర్తించడం సముచితం కాదు. ఈ బిల్లు వెంటనే అమల్లోకి రావాల్సిందే. కుల గణన తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లలో ప్రాతినిధ్యం దక్కాలి.     
– సోనియా

మహిళా రిజర్వేషన్‌ బిల్లును తక్షణం అమల్లోకి తేవాలన్న విపక్షాల డిమాండ్‌ సరికాదు. ఒకవేళ రాహుల్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్, అసదుద్దీన్‌ ఒవైసీ (మజ్లిస్‌ అధినేత) ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్‌ లోక్‌సభా స్థానాలు మహిళలకు రిజర్వ్‌ అయితే మా ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందంటూ అందుకు మళ్లీ మోదీ సర్కారునే నిందిస్తారు. అందుకే నియోజకవర్గాల పునరి్వభజనను సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి సారథ్యంలోని కమిషన్‌ పూర్తి పారదర్శకంగా చేపడుతుంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో వచ్చే నూతన ప్రభుత్వం వెంటనే జన గణన, నియోజకవర్గాల పునర్విభజన చేపడుతుంది. లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్ల కలను సాకారం చేస్తుంది.      
– అమిత్‌ షా  

ఈ బిల్లుతో సవర్ణ మహిళలకే మేలు  
మహిళా రిజర్వేషన్‌ బిల్లును వ్యతిరేకిస్తున్నాం. ఈ బిల్లుతో అగ్ర వర్ణాల మహిళలకే మేలు జరుగుతుంది. పార్లమెంట్‌లో అతి తక్కువ ప్రాతినిధ్యం ఉన్న ఓబీసీ, మైనార్టీ మహిళలకు ఈ రిజర్వేషన్లలో ప్రత్యేకంగా కోటా కలి్పంచకపోవడం దారుణం.   దేశ జనాభాలో ముస్లిం మహిళలు 7 శాతం ఉన్నారు. లోక్‌సభలో వారి సంఖ్య కేవలం 0.7 శాతమే ఉంది. లోక్‌సభలో సవర్ణ మహిళల సంఖ్య పెంచాలని మోదీ ప్రభుత్వం కోరుకుంటోంది. ఓబీసీ, మైనార్టీ మహిళలు ఈ సభలో ఉండడం ప్రభుత్వానికి ఇష్టం లేదు. ఆయా వర్గాల మహిళలను మోదీ సర్కారు దగా చేస్తోంది  
– అసదుద్దీన్‌ ఓవైసీ, ఎంఐఎం పార్లమెంట్‌ సభ్యుడు   

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై చర్చ సందర్భంగా పారీ్టలకతీతంగా మహిళా ఎంపీలు బిల్లుకు ఏకగ్రీవంగా జై కొట్టారు. లోక్‌సభలో 82 మంది మహిళా ఎంపీలుండగా బుధవారం చర్చలో 27 మంది మహిళా ఎంపీలు మాట్లాడారు. అందరూ బిల్లుకు మద్దతుగా మాట్లాడారు. అయితే, బిల్లు ఆలస్యంగా అమలయ్యే అంశాన్ని ప్రధానంగా తప్పుబట్టారు.

Advertisement

What’s your opinion

Advertisement