‘సోషల్‌’ ఖాతా.. మీ తలరాత?

11 Sep, 2019 02:40 IST|Sakshi

వివాదాస్పద కామెంట్లతో ఉద్యోగాలకు ముప్పు

40 శాతం మంది భారతీయుల అభిప్రాయం ఇదే..

ఉపయోగించని ఖాతాలతోనూ తప్పని తిప్పలు

పూర్తిగా బయటకు రాకుంటే భవిష్యత్తులో తలనొప్పులు

ఎప్పటికప్పుడు కంటెంట్‌ క్లియర్‌ చేస్తుండాలని నిపుణుల సలహా..

చాలా మంది తెలిసీ తెలియకుండా సోషల్‌మీడియాలో అనేకానేక కామెంట్లు.. ఫొటోలు.. పోస్ట్‌ లేదా షేర్‌ చేస్తుంటారు. సోషల్‌ మీడియాలో ఖాతా తెరిచి చాలా కాలం పాటు వాడకుండా ఉంటారు.. అవే భవిష్యత్తులో మీకు ముప్పుగా మారు తాయనే విషయం తెలుసా.. ఇదే విషయంపై సైబర్‌ సెక్యూరిటీ సంస్థ మెకాఫీ ఓ అధ్యయనం జరిపింది. ఈ సర్వే ప్రకారం సోషల్‌ మీడియా వాడు తున్న భారతీయుల్లో 40 శాతం మంది తమ ఖాతా ల్లోని వివాదా స్పద విషయాల కారణంగా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదముంద ని అభిప్రాయపడుతున్నట్లు తేలింది. భారత్‌లోని సగానికిపైగా వినియోగదారులు ఏదో ఒక నిద్రాణమైన సోషల్‌ మీడియా ఖాతా లో ఉన్నారు. దేశంలోని 41 శాతం మంది ఉపయోగించకుండా ఉన్న సోషల్‌ మీడియా ఖాతా నుంచి పూర్తిగా నిష్క్రమించడం గురించి ఆలోచించను కూడా ఆలోచించట్లేదని వెల్లడించడం ఆందోళనకు గురిచేస్తోందని మెకాఫీ వైస్‌ ప్రెసిడెంట్‌ వెంకటకృష్ణ చెప్పారు.

గోప్యత గురించి ఆలోచనే లేదు..
ఇటీవల చాలా మంది చాలాకాలం కింద సోషల్‌ మీడియాలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా అభాసుపాలవుతున్న కేసులెన్నో చూస్తున్నాం. సోషల్‌ మీడియా వినియోగదారులు ఎప్పటికప్పుడు తమ అకౌంట్లలోని సమాచారాన్ని తొలగించు కోవడం, సమాచార గోప్యత సెట్టింగ్స్‌ మార్చుకోవడం, వాడని ఖాతాల నుంచి బయటకు రావడం మంచిదని చెబుతున్నారు.

అధ్యయనంలో వెల్లడైన అంశాలు

  • ప్రస్తుతం తాము ఉద్యోగం చేస్తున్న సంస్థకి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టామని 25%పైగా మంది వెల్లడించారు.
  • 21.4% మంది భారతీయులు తమ సోషల్‌ మీడియా అకౌంట్లలోని విషయాలు తమ ఉద్యోగాలపైనా, కెరీర్‌పైనా ప్రతికూల ప్రభావాన్ని చూపాయని చెప్పారు.
  • సామాజిక మాధ్యమాలు వాడుతున్న వారిలో 46.9% మంది తమ వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిపరమైన అంశాలను వేర్వేరుగా ఉంచాలని భావిస్తున్నారు.
  • వెయ్యి మందిపై జరిపిన అధ్యయనంలో 16–24 ఏళ్ల మధ్య వయసు వారిలో 31.4 శాతం మంది కెరీర్‌కు, అవకాశాలకు, సోషల్‌మీడియా అంశాలు కీలకమని భావిస్తున్నారు. 35–44 ఏళ్ల వయసు వారిలో 24.6 శాతం మందే దీన్ని అంగీకరించారు.
  • 16–24 ఏళ్ల వయసు వారిలో 41.1 శాతం మంది తాము పోస్ట్‌ చేసే, లేదా ట్యాగ్‌ చేసే అంశాల పట్ల అప్రమత్తంగా ఉంటున్నారు. 45–55 వయసు వారిలో 35.6% మంది జాగ్రత్త పడుతున్నారు.
  • వ్యక్తిగత గోప్యత అంశాలను ఎలా సెట్‌ చేసుకోవాలో తెలియదని 25.3% మంది వెల్లడించారు.
  • 21.2% మంది తాము పోస్ట్‌ చేసిన అంశాలూ, లేదా ట్యాగ్‌ చేసిన విషయాలు తమ ఉద్యోగాలకు ప్రమాదాన్ని తెచ్చిపెడ తాయని ముందే తెలుసని చెప్పడం ఆశ్చర్యకరం.
>
మరిన్ని వార్తలు