మదర్స్‌ డే రోజు  ఐరన్‌ లేడీకి ట్విన్స్‌ : పేర్లు ఏంటంటే..

13 May, 2019 11:52 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ మరోసారి ఐరన్‌ లేడీ అని నిరూపించుకున్నారు. 46 ఏళ్ల వయసులో షర్మిల కవల పిల్లల​కు జన్మనిచ్చారు. అదీ మాతృదినోత్సవం (మే 12వ తేదీ ఆదివారం) రోజున ఇద్దరు ఆడపిల్లలు పుట్టడం విశేషం. ఈ విషయాన్ని ఆమె సన్నిహితురాలు, దివ్యభారతి సామాజిక మాధ్యమంలో వెల్లడించారు. బెంగళూరు మల్లేశ్వరంలోని క‍్లౌడ్‌లైన్‌ గ్రూప్‌ ఆఫ్‌ హాస్పటల్‌లో ఆదివారం ఉదయం 9.21కి  షర్మిల కవలలకు జన్మనిచ్చారనీ,  తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని ఆమె తెలిపారు. 

వీరికి నిక్స్‌ సఖి, ఆటం తారా అనే పేర్లను ఖాయం చేశారు షర్మిల, డెస‍్మండ్‌ దంపతులు. ఇది తనకు కొత్త జీవితమంటూ షర్మిల  సంతోషం వ్యక్తం చేశారు. అందులోనూ మదర్స్‌ డే రోజు  కవల ఆడబిడ్డలు కలగడం చెప్పలేని ఆనందాన్నిస్తోందన్నారు.  ఆరోగ్యవంతమైన పిల్లలు కావాలని  మాత్రమే తాను డెస్మండ్‌ కోరుకున్నామని ఆమె  పేర్కొన్నారు. 

కాగా మణిపూర్ రాష్ట్రంలో భద్రతా దళాలకు ప్రత్యేక అధికారం అందించే చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ 16 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటంతో ఉక్కు మహిళగా ఘనత కెక్కారు ఇరోమ్‌ షర్మిల. కేవలం ద్రవ పదార్థాలను మాత్రమే నాజల్ ట్యూబ్ ద్వారా ఆమె ఆహారంగా తీసుకున్నారు. 2000 సంవత్సరం ఈ పోరాటాన్ని కొనసాగించారు ఆమె.  ఆ తరువాత 2017 ఆగస్టులో తన ప్రేమికుడు గోవాలో పుట్టిన  బ్రిటిష్‌ జాతీయుడు డెస్మండ్‌  కౌటిన్హోను ఆమె వివాహమాడారు. తమిళనాడులోని కొడైకెనాల్‌లో ఉంటున్నారు.  సుదీర్ఘ  నిరాహార దీక్ష విరమణ అనంతరం శరీరాన్ని తిరిగి పూర్తి స్వాధీనంలోకి తెచ్చుకునేందుకు ఆమె మరో పోరాటమే చేశారు. 

మరిన్ని వార్తలు