జీఎస్టీతో ఆర్థిక వృద్ధి : ఎంపీ మేకపాటి

1 Jul, 2017 01:36 IST|Sakshi
జీఎస్టీతో ఆర్థిక వృద్ధి : ఎంపీ మేకపాటి
సాక్షి, న్యూఢిల్లీ: జీఎస్టీ వల్ల రెండు శాతం మేర జీడీపీ రేటు వృద్ధి చెందుతుందన్న అంచనాలు ఉన్నాయని, ఇది దీర్ఘకాలంలో ఆర్థిక వృద్ధికి ఊతమిస్తుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. జీఎస్టీ ప్రారంభం నేపథ్యంలో ప్రత్యేక పార్లమెంటు సమావేశానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఒకే దేశం ఒకే పన్ను పేరుతో వస్తున్న జీఎస్టీ కాలక్రమంలో ఒక గొప్ప సంస్కరణగా నిలుస్తుంది. జీడీపీ రెండు శాతం పెరుగుతుందని అంటున్నారు. అంతా సవ్యంగా సాగితే ఇది దేశ ఆర్థికాభివృద్ధికి మంచి ఊపునిస్తుంది. దేశంలో మౌలిక వసతులు అభివృద్ధి చెందుతాయి. భవిష్యత్తు బాగుంటుంది.

యూపీఏ హయాంలోనే ప్రతిపాదన వచ్చినా ఏకాభిప్రాయం రాలేదు. ఇప్పుడు అందరూ అంగీకరించిన మీదట జీఎస్టీ అమలులోకి వస్తోంది. అయితే జీఎస్టీ గురించి చిన్న తరహా వర్తకులు భయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అందరి ప్రయోజనాలు కాపాడాలి. మైనారిటీలు, దళితులు, బలహీన వర్గాలు ఎవరైనా కూడా తమకు భద్రత లేదన్న భావన పొరపాటున కూడా రాకూడదు. కేంద్ర ప్రభుత్వం అందరి ప్రయోజనాలు కాపాడుతుందన్న భావన రావాలి. అందుకు వీలుగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి’ అని చెప్పారు. గోరక్ష పేరుతో దాడులు తగవని స్వయంగా ప్రధాని పిలుపునిచ్చిన విషయం అందరూ గమనించాలన్నారు. దేశంలో అందరి ప్రయోజనాలకు రక్షణ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. 
మరిన్ని వార్తలు