‘అదే దక్షిణాదైతే నిన్ను ముక్కలుగా నరికేవారు’

2 Oct, 2018 13:13 IST|Sakshi

రుతుచక్రం.. మెన్సురేషన్‌, పిరియడ్స్‌ పేరేదైనా కావచ్చు. కానీ ఇప్పటికి మన దేశంలో ఇది ఒక అంటరాని మాటే. ఆడపిల్లగా పుట్టి మహిళగా ఎదిగే క్రమంలో స్త్రీ శరీరంలో జరిగే అతి సహజమైన మార్పుల్లో ఇది ఒకటి. కానీ ఇప్పటికి మన సమాజంలో నూటికి తొంభై తొమ్మిది మంది బహిరంగంగా ఈ పేరును పలకడానికి కూడా ఇష్టపడరు. మనిషి జీవితంలో ఆకలి, నిద్ర, బాధ, కోపంలాగానే పిరియడ్స్‌ కూడా ఓ భాగమైనప్పుడు మరేందుకు దాన్ని గురించి మాట్లాడలంటే జంకు. ఇప్పటికి మనదేశంలో పిరియడ్స్‌ సమయంలో ఆడవారు ఇంట్లో అన్ని గదుల్లో తిరగకూడదు.. మరీ ముఖ్యంగా పూజ గదిలోకి కానీ, ఆలయంలోకి కానీ ప్రవేశించకూడదు. పండగలు వంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. అరే.. సృష్టికి మూలం స్త్రీ అయినప్పుడు.. పిరియడ్స్‌ పేరు చెప్పి ఆ స్త్రీనే దేవునికి దూరంగా ఉంచడం ఎంత వరకూ సమంజసం.

ఇదే ఆలోచన వచ్చింది ముంబైకు చెందిన అనికేత్‌ మిత్రా అనే కళాకారునికి. ఈ విషయం గురించి సమాజంలో చైతన్యం కల్గించడం కోసం కాస్తా విభిన్నమైన ఆర్ట్‌ వర్క్‌ని రూపొందించారు. అయితే మంచిని ఆలోచించి చేసిన ఆర్ట్‌ వర్క్‌ కాస్తా ఇప్పుడు అతనికి సమస్యలు తెచ్చిపెట్టింది. వివరాలు.. రానున్న నవరాత్రి ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని అనికేత్‌ అమ్మవారి రూపాన్ని ఎవరి ఊహకు అందనటువంటి విధంగా రూపొందించారు. స్త్రీ సహజమైన రుతుక్రమాన్ని ప్రధాన థీమ్‌గా తీసుకున్నారు. అందులో భాగంగా శానిటరీ నాప్‌కిన్‌ మీద ఎరుపు రంగులో ఉన్న కమలాన్ని చిత్రించారు. ఈ ఎరుపు రంగును పిరియడ్స్‌ సమయంలో జరిగే బ్లీడింగ్‌కు ప్రతి రూపంగా ఎంచుకున్నానని చెప్తారు మిత్రా. శానిటరీ నాప్‌కిన్‌ వెనక భాగాన దుర్గమాతాను అలంకరించే విధంగా డెకరేట్‌ చేసి ఫొటో తీసి తన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు.

దాంతో ఈ ఆర్ట్‌ వర్క్ కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఆర్ట్‌ వర్క్‌ గురించి ప్రజల్లో మిశ్రమ స్పందన వెలువడింది. ‘ఇది కోల్‌కతా కాబట్టి కేవలం నీ మీద కంప్లైంట్‌ ఇచ్చి వదిలేస్తున్నాం. అదే దక్షిణ భారతదేశంలో నువ్వు ఇలాంటి వేషాలు వేస్తే ఈ పాటికే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేసేవారు’ అంటూ విమర్శిస్తున్నారు. అంతేకాక ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే నీకే ప్రమాదం అంటూ బెదిరింపు కాల్స్‌ కూడా వచ్చాయని తెలిపారు అనికేత్‌. కానీ మరో వర్గం నెటిజన్లు అనికేత్‌ సృజనను మెచ్చుకోవడమే కాక ఈ ఫొటోని షేర్‌ చేస్తున్నారు. పోస్ట్‌ చేసిన 24 గంటల్లోనే దాదాపు 4 వేల మంది ఈ ఫోటోని షేర్‌ చేశారు.

ఈ విషయం గురించి అనికేత్‌ మాట్లాడుతూ.. ‘మన దేశంలో స్త్రీలు పిరియడ్స్‌ సమయంలో తమను తామే అపవిత్రంగా భావించుకుంటారు. అందువల్లే ఎటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొనరు. ఈ ఆలోచనను తప్పు అని చెప్పి వారిలో చైతన్యం కల్గించడం కోసమే నేను ఇలాంటి ఆర్ట్‌ వర్క్‌ని రూపొందించాను. నన్ను విమర్శించేవారిని, బెదిరించేవారిని నేను పట్టించుకోను. ఈ విషయంలో నాకు మద్దతు ఇస్తున్నవారే నాకు ముఖ్యం’ అన్నారు. పిరియడ్స్‌ కారణంగానే కేరళ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి 10 - 50 ఏళ్ల మహిళల ప్రవేశంపై నిషేధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిషేధం చెల్లదంటూ.. శారీరక కారణాలు చెప్పి మహిళలను ఆలయంలోకి ప్రవేశించకుండా చేయడం నేరమని సుప్రీం కోర్టు తాజాగా తీర్పునిచ్చింది.

మరిన్ని వార్తలు