33,000 రుద్రాక్షలతో బాల్‌ థాకరే చిత్రపటం

23 Jan, 2019 11:48 IST|Sakshi

సాక్షి, ముంబై : శివసేన వ్యవస్ధాపకులు బాలాసాహెబ్‌ థాకరే 93వ జయంతోత్సవాల సందర్భంగా ఆర్టిస్ట్‌ చేతన్‌ రౌత్‌ 33,000 రుద్రాక్షలతో థాకరే ప్రత్యేక చిత్రపటం రూపొందించారు. బాలాసాహెబ్‌ థాకరేకు రుద్రాక్షలతో ప్రత్యేక అనుబంధం ఉండటంతో వాటితోనే ఆయన చిత్రపటం రూపొందించానని రౌత్‌ చెప్పారు. 8 అడుగుల ఎత్తు 8 అడుగుల వెడల్పుతో 33,000 రుద్రాక్షలతో దీన్ని తయారుచేశానని..దీన్ని ప్రపంచ రికార్డుగా మలిచేందుకు ప్రయత్నించానని వెల్లడించారు.

థాకరే జయంతోత్సవాలకు అంకితం చేస్తూ ఈ చిత్రపటాన్ని ముంబైలోని శివసేన భవన్‌ ఎదురుగా అమర్చారు. కాగా దివంగత థాకరే స్మృతి చిహ్నం నిర్మాణానికి రూ 100 కోట్లు కేటాయించాలని మహారాష్ట్ర కేబినెట్‌ నిర్ణయించింది. గతంలో ముంబై మేయర్‌ బంగ్లా ఉన్న శివాజీ పార్క్‌ ఏరియాలో థాకరే మెమోరియల్‌ నిర్మించనున్నారు. మెమోరియల్‌ నిర్మాణం కోసం సముద్రానికి అభిముఖంగా ఉన్న 11,500 చదరపు మీటర్ల స్ధలాన్ని ఇప్పటికే బాలాసాహెబ్‌ థాకరే రాష్ర్టీయ స్మారక్‌ న్యాస్‌ (ట్రస్టు)కు కేటాయించారు.

మరిన్ని వార్తలు