ఆ స్కూలులో తల్లిదండ్రులకూ డ్రెస్‌కోడ్‌

4 Apr, 2017 16:35 IST|Sakshi
ఆ స్కూలులో తల్లిదండ్రులకూ డ్రెస్‌కోడ్‌

ముంబయి: సాధారణంగా పాఠశాలల్లో క్రమ శిక్షణ విద్యార్థులకు మాత్రమే ఉంటుంది. కానీ, ముంబయిలోని బాంద్రాలో గల ఓ పాఠశాల తల్లిదండ్రులకు కూడా క్రమశిక్షణ తాలూకు నియమ నిబంధనలు విధించింది. ముఖ్యంగా వారి డ్రెస్‌ కోడ్‌ విషయంలో నొక్కి చెప్పింది. విద్యార్థుల విషయంలో ప్రతి నెల పాఠశాలలో జరిగే తల్లిదండ్రుల సమావేశాలకు వారు తప్పకుండా హుందాతనంతో కూడిన, డిసెంట్‌ దుస్తులనే ధరించి వస్తానని హామీ ఇవ్వాలని, ఒక వేళ అలా రాకుంటే తదుపరి జరగబోవు పరిణామాలకు, పాఠశాల యాజమాన్యం తీసుకునే చర్యలకు బాధ్యత వహిస్తామని ముందుగా ఒప్పుకోవాలంటూ ఆ నిబంధనల్లో చేర్చింది.

బాంద్రాలోని రిజ్వీ స్ప్రింగ్‌ఫీల్డ్‌ స్కూల్‌ ఈ నిబంధన పెట్టింది. గత నెల మార్చి 30న ప్రొగ్రెస్‌ కార్డులను పంపించిన పాఠశాల వాటిని తీసుకొని తల్లిదండ్రులు రావాలని అలా వచ్చే సమయంలో హుందాగా డ్రెస్‌లు ధరించాలని అందులో పేర్కొంది. అంతేకాకుండా ఒక వేళ మొబైల్‌ ఫోన్స్‌తో వస్తే వాటిని రిసెప్షన్‌లోనే అందజేయాలని, స్కూల్‌ ప్రాంగణంలో ఎలాంటి చెడు ప్రవర్తన చూపించరాదని, అడిగే ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పాలని, స్టాఫ్‌ను తిట్టడంగానీ, వారితో దురుసుగా ప్రవర్తించడంగానీ చేయరాదంటూ పలు నిబంధనలు పెట్టింది. అయితే, దీనిపై తీవ్ర నిరసన తెలిపిన తల్లిదండ్రులు అసలు తాము ఏ దుస్తులు వేసుకోవాలో వేసుకోకూడదో స్కూల్‌ చెప్పడమేమిటని నిలదీస్తున్నారు. మాకు అంత బాధ్యత లేదని అనుకుంటున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు