నిష్పక్షపాత దర్యాప్తు జరపండి సత్యపాల్‌సింగ్ డిమాండ్

3 Jun, 2014 22:54 IST|Sakshi

ముంబై: తనకు చెందిన ప్లాటులో వ్యభిచారం జరుగుతున్న వచ్చిన ఆరోపణలపై నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని బీజేపీ ఎంపీ, ముంబై మాజీ పోలీస్ కమిషనర్ సత్యపాల్ సింగ్ డిమాండ్ చేశారు. వర్సోవాలోని పాటిలీపుత్ర హౌసింగ్ సొసైటీలో సింగ్‌కు సొంత ఫ్లాట్ ఉంది. దాన్ని మూడేళ్ల కిందట ఓ ప్రైవేటు కంపెనీకి అద్దెకు ఇచ్చారు. అందులో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత అకస్మాత్తుగా దాడులు చేశారు.

 ఫ్లాటులో ఇద్దరు యువతులు, ఒక బ్రోకర్ ఉండడంతో వారిని అరెస్టు చేశారు. ఈ ఫ్లాటు మాజీ పోలీస్ కమిషనర్ సత్యపాల్ సింగ్‌కు చెందినదనే విషయం అప్పటికి పోలీసులకు తెలియదు. వారిని అదుపులోకి తీసుకుని బయటకు వెళ్తున్న సమయంలో భవనం ప్రవేశ ద్వారం వద్ద ఫ్లాటు యజమానుల పేర్లు రాసిన బోర్డుపై పోలీసుల దృష్టి పడింది. ఫ్లాటు నంబరు ఏ-1002 డాక్టర్ సత్యపాల్ సింగ్ పేరుతో ఉంది. అప్పుడు పోలీసులకు ఇది మాజీ నగర పోలీసు కమిషనర్ ఫ్లాట్ అని తెలిసి ఒక్కసారి అవాక్కయ్యారు. ఇంట్లో సోదా చేయగా విద్యుత్ బిల్లులు కూడా సింగ్ పేరిట ఉన్నాయి.

 నగరంలో ఉగ్రవాదుల దాడుల సంఘటనలు పెరిగిపోవడంతో వాహనాలు, ఇళ్లు, ఫ్లాట్లు గుర్తు తెలియని వ్యక్తులకు విక్రయించరాదని ప్రభుత్వం ఆదేశించింది. వాహనం కొనుగోలుచేసే వారి, ఇంట్లో అద్దెకు ఉండే వారి వివరాలు ముందుగా స్థానిక పోలీసు స్టేషన్‌లో అందజేయాలని స్వయంగా పోలీసుశాఖ ఆదేశించింది. కాని పోలీసుశాఖలో ఒక ఉన్నతాధికారి స్థాయిలో ఉన్న సింగ్ తన ఫ్లాట్ అద్దెకు ఇచ్చే ముందు ఆ ప్రైవేటు కంపెనీ గురించి ఆరా తీయలేదా..? అనే విషయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసు అధికారులే ఇలా ఉంటే ఇక సాధారణ పౌరులు పోలీసులకు ఎలా సహకరిస్తారని ప్రశ్నిస్తున్నారు. 

మరిన్ని వార్తలు