పరిమళించిన మానవత్వం

31 Mar, 2020 14:12 IST|Sakshi
రవిశంకర్‌ పాడె మోస్తున్న ముస్లింలు

హిందువు అంత్యక్రియలు నిర్వహించిన ముస్లింలు

బులంద్‌షహర్‌ : ప్రపంచమంతా కరోనా ధాటికి గడగడ వణుకుతున్న వేళ మానవత్వానికి ఆలంబనగా నిలిచిన అరుదైన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షెహర్‌లో వెలుగు చూసింది. ఆపత్కాలంలో ఆయువు తీరిన నిరుపేద హిందూ మతస్థుడి అంత్యక్రియలకు అయినవారు రాలేకపోయిన వేళ సాటి ముస్లింలు మానవత్వం ప్రదర్శించి మతసామరస్యం చాటారు. మతాల అడ్డుగోడలను అధిగమించి ఆపన్న హస్తం అందించి ఆదర్శంగా నిలిచారు.

మానవత్వానికి, మతసామరస్యానికి అద్దం పట్టిన ఈ ఘటన బులంద్‌షెహర్‌లోని మౌలానా ఆనంద్‌ విహార్‌లో చోటుచేసుకుంది. రవిశంకర్‌ అనే వ్యక్తి క్యాన్సర్‌ వ్యాధితో ఆదివారం మరణించాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అంత్యక్రియలకు బంధువులు, స్నేహితులు రాలేకపోయారు. నిరుపేద కుటుంబం దీనావస్థను గమనించిన చుట్టుపక్కల ముస్లింలు.. రవిశంకర్‌ అంత్యక్రియల్లో సాయం చేశారు. స్వయంగా పాడె మోసి మృతదేహాన్ని శ్మశానికి తరలించడంలో సహాయపడ్డారు. భౌతికకాయాన్ని తరలించే సమయంలో 'రామ్‌ నామ్‌ సత్య హై' అంటూ నినాదాలు చేస్తూ మతసామరస్యాన్ని చాటారు. హిందూ సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించేందుకు తోడ్పాటు అందించారు. 

లాక్‌డౌన్‌ కారణంగా బంధువులు రాలేకపోయారని, ముస్లిం సోదరుల అండతో తన తండ్రి అంత్యక్రియలు నిర్వహించామని రవిశంకర్‌ కుమారుడు చెప్పారు. కరోనా మహమ్మారి విరుచుకుపోతున్న వేళ మునుపెన్నడూ చూడని ప్రత్యేక పరిస్థితులు నెలకొనడంతో దేశంలోని ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పేదలు, బడుగులు, కూలీలు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బులంద్‌షెహర్‌లోని ముస్లింలు చూపిన మానవత్వం యావత్‌ దేశానికి ఆదర్శంగా నిలిచింది. (వైరల్‌ వీడియో : వలస కార్మికుడు దీనస్థితి)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా