ఆందోళనకారులకు 23 లక్షల జరిమానా

13 Feb, 2020 13:39 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లోని ముజాఫర్‌నగర్‌లో ఆందోళన చేస్తూ ప్రజల ఆస్తులకు నష్టం కల్గించిన వారికి ముజాఫర్‌నగర్‌ జిల్లా కోర్టు నష్ట పరిహారం కింద భారీ జరిమానా విధించింది. సమష్టిగా 23.41 లక్షల రూపాయల నష్ట పరిహారాన్ని చెల్లించాల్సిందిగా మొత్తం 53 మంది నిందితులను కోర్టు ఆదేశించింది. ఈ మేరకు వారి నుంచి పరిహారం వసూలు చేయాల్సిందిగా ఆదేశిస్తూ జిల్లా తహసీల్దార్‌కు ఉత్తర్వులు జారీ చేసినట్లు అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌ అమిత్‌ సింగ్‌ మీడియాకు తెలిపారు. (చదవండి: కొట్టరాని చోటా కొట్టారు)

సీఏఏకు వ్యతిరేకంగా డిసెంబర్‌ 20వ తేదీన యూపీలోని లక్నో, కాన్పూర్, మీరట్, ముజాఫర్‌నగర్, సంభాల్, రాంపూర్, బిజ్‌నార్, బులంద్‌షహర్‌ జిల్లాల్లో ప్రజలు ఆందోళనలు నిర్వహించారు. అవికాస్త విధ్వంసకాండకు దారితీయడంతో 1.9 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. దీనిపై కేసులు నమోదు చేసిన రాష్ట్ర పోలీసులు, సీసీటీవీ కెమేరాల ఫుటేజ్‌ ద్వారా విధ్వంసానికి పాల్పడిన మొత్తం 295 మందిని గుర్తించారు. వారిలో ముజాఫర్‌నగర్‌లో విధ్వంసానికి పాల్పడిన వారు 57 మంది ఉన్నారు. వారందరికి కోర్టు ద్వారా నోటీసులు వెళ్లాయి. తాము ఎలాంటి విధ్వంసానికి పాల్పడలేదంటూ వారిలో 53 మంది కోర్టుకు సమాధానం ఇచ్చారు. సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించిన కోర్టు మరో మాట లేకుండా 23.41 లక్షల రూపాయల నష్ట పరిహారాన్ని చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. (చదవండి: వినూత్న నిరసన తెలిపిన పెళ్లికొడుకు)

>
మరిన్ని వార్తలు