‘నా హృదయం పోయింది.. వెతికి పెట్టండి’

9 Jan, 2019 15:44 IST|Sakshi

ముంబై : సాధరణంగా పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి డబ్బులు పోయాయనో లేదా వస్తువులు పోయాయనో లేదా ఇతర వివాదాల గురించి ఫిర్యాదు చేస్తుంటారు. కానీ ఒక్కోసారి వీటికి భిన్నమైన ఫిర్యాదులు వస్తూంటాయని తెలిపారు నాగపూర్‌ పోలీసులు. ఇటీవల ఓ దొంగతనం కేసులో నాగపూర్‌ పోలీసులు దాదాపు రూ. 82 లక్షల విలువైన సొత్తును వెతికి పెట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నాగపూర్‌ పోలీస్‌ కమిషనర్‌ భూషణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. పోయిన వస్తువులను మేం వెతికి పెట్టడానికి ప్రయత్నిస్తాం. కానీ ఒక్కోసారి కాస్తా డిఫరెంట్‌ కేసులు మా ముందుకు వస్తూంటాయని గతంలో తనకెదురైన అనుభవాన్ని ఈ సందర్భంగా వెల్లడించారు.

భూషణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. కొన్ని రోజుల క్రితం నాగ్‌పూర్‌ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి నా హృదయం చోరికి గురయ్యిందంటూ కంప్లైంట్‌ ఇచ్చాడు. ‘ఓ అమ్మాయి నా హృదయాన్ని దోచుకుంది. మీరు ఎలాగైన తన వద్ద ఉన్న నా హృదయాన్ని తిరిగి నాకు ఇప్పించాలని’ కోరాడు. ఇది విని మొదట ఆశ్చర్యపోయిన పోలీసులు తేరుకుని ఇలాంటి సమస్యల్ని మేం పరిష్కరించలేము బాబు అని చెప్పారు. అంతేకాక ఇలాంటి ఫిర్యాదులు నమోదు చేయడం కూడా కుదరదని తేల్చిచెప్పారు పోలీసులు. అయినా ఆ యువకుడు వారి మాట వినలేదు. దాంతో ఏం చేయాలో తెలీక స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ పై అధికారులకు సమాచారం అందించారు. వారి ఆదేశాల మేరకు యువకుడికి నచ్చజెప్పి పంపించారంటూ చెప్పుకొచ్చారు భూషణ్‌ కుమార్‌.

మరిన్ని వార్తలు