గుజరాత్ అల్లర్లపై ‘నానావతి’ నివేదిక

19 Nov, 2014 05:43 IST|Sakshi

గాంధీనగర్: గుజరాత్ అల్లర్లపై దర్యాప్తునకు నియమించిన జస్టిస్ నానావతి కమిషన్ మంగళవారం తన రెండో, తుది నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్‌కు అందజేసింది. కమిషన్ ఏర్పాటైన 12 ఏళ్ల తర్వాత, 24 పొడిగింపుల అనంతరం దీన్ని సమర్పించారు. దర్యాప్తునకు రూ. 7 కోట్లు ఖర్చయ్యాయి. క మిషన్‌కు సాక్షుల వాంగ్మూలాలతో కూడిన 45 వేల అఫిడవిట్లు అందాయి. కమిషన్ సారథి, సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ జీటీ నానావతి, సభ్యుడైన హైకోర్టు రిటెర్డ్ జడ్జి అక్షయ్ మెహతాలు సీఎం ఇంటికి చేరుకుని 2 వేల పేజీల నివేదికను సమర్పించారు. అయితే అందులోని అంశాలను వెల్లడించడానికి నానావతి నిరాకరించారు. వాటిని బయటపెడితే తమ కమిషన్‌కు రాష్ట్ర అసెంబ్లీ నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుందని విలేకర్లతో అన్నారు.

 

నివేదికను బహిర్గతం చేయాలో, వద్దో నిర్ణయించుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనన్నారు. నివేదికకు ఎందుకు జాప్యం జరిగిందో చెప్పడానికి నిరాకరించారు. తమ విచారణలో చాలామంది సాక్ష్యం ఇవ్వటానికి ముందుకు రాలేదని తెలిపారు. 2002 నాటి గుజరాత్ అల్లర్లలో  అత్యధికంగా మైనారిటీలు సహా వెయ్యిమందికిపైగా బలవటం తెలిసిందే. నాటి హింసకు సంబంధించి అప్పటి సీఎం, నేటి ప్రధాని నరేంద్ర మోదీ, నాటి రాష్ట్ర మంత్రులతోపాటు ప్రభుత్వ యంత్రాంగం పాత్ర, మతఛాందసవాద సంస్థల పాత్రను నిగ్గుదేల్చడానికి 2002లో రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిషన్‌ను నియమించింది. ఇది 2008లో ఇచ్చిన తొలి నివేదికలో.. గోధ్రారైలు దహనం పథకం ప్రకారం జరిగిందని పేర్కొంటూ, మోదీకి, అప్పటి రాష్ట్ర మంత్రులకు క్లీన్‌చిట్ ఇచ్చింది.

మరిన్ని వార్తలు