పాకిస్తాన్‌తో చర్చలకు సిద్ధం

21 Aug, 2018 01:50 IST|Sakshi
భారత ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ / ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌తో నిర్మాణాత్మక, అర్ధవంతమైన చర్చలకు తాము సిద్ధంగా ఉన్నా మని భారత ప్రధాని నరేంద్ర మోదీ పాక్‌ నూతన ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు తెలిపారు. ఇరుదేశాలు ద్వైపాక్షిక సంబంధాల్లో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తాయని విశ్వసిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఇమ్రాన్‌ ఖాన్‌కు ఆగస్టు 18న లేఖ రాశారు. పాక్‌ సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించి 22వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఇమ్రాన్‌కు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. పాకిస్తాన్‌తో భారత్‌ శాంతిని కోరుకుంటోందనీ, ఇరుదేశాల మధ్య సత్సంబంధాల పునరుద్ధరణకు తాము కట్టుబడి ఉన్నామని మోదీ లేఖలో పేర్కొన్నారు.

దక్షిణాసియాను ఉగ్రరహిత ప్రాంతంగా మార్చాల్సిన బాధ్యత పాకిస్తాన్‌పై ఉంద ని ప్రధాని స్పష్టం చేశారు. మరోవైపు నిరంతర చర్చల ద్వారానే భారత్‌–పాక్‌ల మధ్య ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయని పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి షా మహమూద్‌ ఖురేషి అన్నారు. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా కశ్మీర్‌ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిందేనని ఖురేషి పునరుద్ఘాటించారు. అఫ్గానిస్తాన్‌లో శాంతి లేకుంటే పాక్‌ ప్రశాంతంగా ఉండలేదని వ్యాఖ్యానించారు. 

చిన్న ఇంటికి మారిపోయిన ఇమ్రాన్‌.. 
పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తాను చెప్పినట్లే మూడు బెడ్‌రూమ్‌లు ఉన్న ఇంట్లోకి మారిపోయారు. ఇప్పటివరకూ ఇమ్రాన్‌ ఉంటున్న బంగ్లాకు భద్రత కల్పించడం సాధ్యం కాదని ఉన్నతాధికారులు చెప్పడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. తాను ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక విలాసవంతమైన ప్రధానమంత్రి నివాసంలో ఉండబోనని ఇమ్రాన్‌ గతంలో చెప్పారు. అందుకు అనుగుణంగానే ఇద్దరు సహాయకులతో కలసి సోమవారం పాక్‌ ఆర్మీ కార్యదర్శికి కేటాయించిన ఇంట్లోకి మారిపోయారు.  

పాక్‌ కేబినెట్‌ తొలి భేటీ.. 
ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలో పాకిస్తాన్‌ కేబినెట్‌ సోమవారం తొలిసారి సమావేశమైంది. ఇస్లామాబాద్‌లోని ప్రధాని కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ నూతన విధివిధానాలను రూపొందించడంపై ఇమ్రాన్‌ ఖాన్‌ చర్చలు జరిపారు. పాక్‌ అధ్యక్షుడు మమ్నూన్‌ హుస్సేన్‌ ఇమ్రాన్‌తో పాటు మరో 21 మందితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించిన సంగతి తెలిసిందే. వీరిలో 16 మందికి మంత్రిత్వ శాఖలు కేటాయించిన ఇమ్రాన్‌.. మిగిలినవారిని తన సలహాదారులుగా నియమించారు.

>
మరిన్ని వార్తలు