ఇంతటితో ‘రేప్‌’లు తగ్గిపోతాయా!?

6 Dec, 2019 13:39 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘దిశ’ అత్యాచారం–హత్య కేసు నేరస్థులను ఎన్‌కౌంటర్‌లో కాల్చివేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్న విషయం తెల్సిందే. ఇంతటితో మహిళలపై అత్యాచారాలు ఆగిపోతాయా ? లేదా తగ్గిపోతాయా ? మగాళ్ల భయం లేకుండా మహిళలు ఇక సమాజంలో స్వేచ్చగా సంచరించగలరా? వారి భద్రతకు సమాజం భరోసా ఇవ్వగలదా ? 2012లో ఢిల్లీ పారా మెడికల్‌ స్టూడెంట్‌ ‘నిర్భయ’ కేసు వెలుగులోకి వచ్చినప్పుడు కూడా దేశవ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి ఇప్పటిలాగే ఆందోళన వ్యక్తం అయింది. నేరస్థులకు ఉరిశిక్ష విధించాలంటూ, అందుకు కఠిన చట్టాలు తీసుకురావాలంటూ ప్రజా ఉద్యమాలు పెద్ద ఎత్తున కొనసాగాయి. ఫలితంగా ‘క్రిమినల్‌ లా (అమెండ్‌మెంట్‌) యాక్ట్‌–2013’ను తీసుకొచ్చారు. అప్పటి వరకు రేప్‌ కేసుల్లో దోషులకు గరిష్టంగా ఏడేళ్లే జైలు శిక్ష విధించే అవకాశం ఉండింది. దాన్ని 20 ఏళ్ల నుంచి యావజ్జీవ కారాగార శిక్ష వరకు పొడిగించే అవకాశం సవరణతో లభించింది. గ్యాంగ్‌ రేప్‌లను దష్టిలో పెట్టుకొని రేప్‌ నిర్వచనాన్ని కూడా ఆ చట్టంలో మార్చారు. దాని వల్ల ఎలాంటి లైంగిక దాడిని కూడా రేప్‌ కేసుగా పరిగణించే అవకాశం వచ్చింది. 2015లో ‘జువెనైల్‌ జస్టిస్‌ యాక్ట్‌’లో సవరణలు తీసుకొచ్చారు. తద్వారా 16 ఏళ్ల నుంచి 18 ఏళ్లలోపు మైనర్లను  హత్యా, రేప్‌ కేసుల్లో పెద్ద వాళ్లలాగానే విచారించి, శిక్షించే అవకాశం లభించింది.

ఇక 2018లో 12 ఏళ్ల లోపు మైనర్లను రేప్‌ చేసినట్లయితే వారికి మరణ శిక్ష విధిస్తూ కేంద్ర ప్రభుత్వం మరో చట్టాన్ని తీసుకొచ్చింది. మహిళలపై అత్యాచారాలకు సంబంధించి 2013 నుంచి చట్టాలు కఠినతరం అవుతూ వచ్చాయి కనుక ఆశించిన మేరకు రేప్‌ కేసులు తగ్గుతూ రావాలి. ‘నేషనల్‌ క్రైమ్స్‌ రికార్డ్స్‌ బ్యూరో’ లెక్కల ప్రకారం 2012లో దేశవ్యాప్తంగా 25 వేలకన్నా తక్కు రేప్‌ కేసులు నమోదయ్యాయి. 2013లో వాటి సంఖ్య 33,707కు పెరిగాయి. 2016 నాటికి రేప్‌ కేసుల సంఖ్య 38,947కు చేరుకున్నాయి. 2017లో మాత్రమే కాస్త తగ్గాయి. రెండేళ్లు ఆలస్యంగా 2017లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘నేషనల్‌ క్రైమ్స్‌ రికార్డ్స్‌ బ్యూరో’ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలోని లెక్కలపై నిపుణుల అనుమానాలు వ్యక్తం చేశారు.  2018 నివేదిక ఇంతవరకు విడుదల కాలేదు.

2013 నుంచి రేప్‌ కేసులు ఢిల్లీ, ముంబై లాంటి నగరాల్లో ఎక్కువగా పెరిగాయి. 2012లో ఢిల్లీలో 585 రేప్‌ కేసులు నమోదుకాగా, 2013లో 1441 కేసులు, 2016లో 1996 కేసులు నమోదుకాగా, 2017లో 1168 కేసులు నమోదయ్యాయి. మైనర్లపై కూడా అత్యాచారాలు పెరిగాయి. 2017లో రేప్‌ల సంఖ్య తగ్గడం నిజమనుకన్నా చార్జిషీట్ల సంఖ్య 87 శాతం నుంచి 61 శాతానికి పడిపోవడం అంతుచిక్కని ఆశ్చర్యకర అంశం. 2013 నుంచి రేప్‌ కేసులు పెరగడంతోపాటు రేప్‌ పెండింగ్‌ కేసులు కూడా భారీగా పెరిగాయి. ఈ కేసుల్లో నేరస్థులకు శిక్ష పడడం అప్పటి నుంచి ఇప్పటి వరకు 25 నుంచి 30 శాతమే కొనసాగుతోంది.

రేప్‌ కేసులను సత్వరం విచారించేందుకు దేశవ్యాప్తంగా ‘ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు’ ఏర్పాటు చేస్తామని కేంద్రం గత ఐదేళ్లుగా చెబుతూనే ఉంది. ఇప్పటి వరకు 664 కోర్టులను మాత్రమే ఏర్పాటు చేసింది. మరో 1023 కోర్టులను ఏర్పాటు చేస్తామని ఇటీవలే ప్రకటించింది. రేప్‌ కేసులకు కఠిన చట్టాలను తీసుకరావడం వల్ల గతంలో బాధితులను ప్రాణాలతో వదిలేసే వారని, ఇప్పుడు సాక్ష్యాధారాలను కనుమరుగు చేయడంలో భాగంగా బాధితులను పెట్రోలు లేదా కిరోసిన్‌ పోసి తగులబెడుతున్నారని సామాజిక విశ్లేషకులు చెబుతున్నారు. ఏదిఏమైన ‘దిశ’లాంటి రేప్‌ కేసుల్లో దాదాపు అన్ని వర్గాల ప్రజలు ఏదోరకమైన ‘సత్వర మరణ శిక్ష’లు కోరుకుంటున్నారు. ఇలాంటి ‘న్యాయం’తో ఇక ముందు రేప్‌లు తగ్గక పోతే అణుక్షణం మానసిక క్షోభ అనుభవించాల్సిన ‘ఆ నలుగురు’ నేరస్థులకు అన్యాయంగా విముక్తి కల్గించిన వాళ్లం అవుతాం!!

మరిన్ని వార్తలు