ఒడిశాలో ‘రైతుబంధు’

22 Dec, 2018 04:36 IST|Sakshi

కొత్త పథకం ‘కలియా’ను ప్రారంభించిన సీఎం

భువనేశ్వర్‌: రైతులకు అండగా నిలిచేందుకు ఒడిశా ప్రభుత్వం ఓ భారీ పథకాన్ని ప్రారంభించింది. రైతులకు పెట్టుబడి వ్యయం, భూముల్లేని వారికి వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రోత్సాహం, వృద్ధాప్యం, అంగవైకల్యం తదితర కారణాలతో వ్యవసాయం చేయలేని స్థితిలో ఉన్న రైతులకు ఆర్థిక సహాయం తదితరాలు ఈ పథకంలో ఉన్నాయి. కలియా (కృషక్‌ అసిస్టెన్స్‌ ఫర్‌ లైవ్లీహుడ్‌ అండ్‌ ఇన్‌కం ఆగ్మెంటేషన్‌) పేరుతో కొత్త పథకాన్ని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ శుక్రవారం మంత్రివర్గ సమావేశం అనంతరం ప్రకటించారు.

ఈ పథకం కింద 2020–21 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ. 10,180 కోట్లను ఒడిశా ప్రభుత్వం ఖర్చు చేయనుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇస్తున్న రుణమాఫీ హామీలు అర్థరహితమని నవీన్‌ పట్నాయక్‌ అన్నారు. రుణమాఫీ కన్నా తమ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకంతోనే రైతులకు ఎక్కువ లబ్ధి చేకూరుతుందనీ, అధిక శాతం మందికి ప్రయోజనాలు చేకూరుతాయని ఆయన తెలిపారు. ఒడిశాలో దాదాపు 32 లక్షల మంది రైతులుంటే కేవలం 20 లక్షల మందే పంటరుణాలను తీసుకున్నారనీ, రుణమాఫీ ప్రకటిస్తే మిగిలిన 12 లక్షల మందికి ప్రయోజనం ఉండదనీ, తమ కలియా పథకం మాత్రం 30 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగిస్తుందని పట్నాయక్‌ వివరించారు.  

ఇవీ పథకం ప్రయోజనాలు
► భూ విస్తీర్ణంతో నిమిత్తం లేకుండా వ్యవసాయం చేసే ప్రతీ కుటుంబానికి ఒక్కో సీజన్‌లో (ఖరీఫ్, రబీ) పెట్టుబడి కోసం రూ. 5,000 ఆర్థిక సాయం. కౌలు రైతులు కూడా ఈ మొత్తం పొందడానికి అర్హులే.

► గొర్రెలు, కోళ్లు, బాతులు, తేనెటీగల పెంపకం దార్లకు, చేపలు పట్టే వారికి అవసరమైన సామగ్రిని సమకూర్చుకునేందుకు రూ. 12,500 ఆర్థిక సాయం. భూమి లేని వారే ఇందుకు అర్హులు. వీటిలో ఏదో ఒక దాన్నే ఎంచుకోవాలి.

► వృద్ధాప్యం, అంగవైకల్యం, రోగాలు తదితర కారణాల వల్ల వ్యవసాయం చేయలేకపోతున్న రైతులకు ఒక్కో ఇంటికి ఏడాదికి రూ. 10 వేల ఆర్థిక సాయం. లబ్ధిదారులను గ్రామ పంచాయతీలు ఎంపిక చేస్తాయి.  

► భూమి ఉన్న, లేని రైతులనే భేదం లేకుండా అందరికీ రూ. 2 లక్షల జీవిత బీమా, మరో రూ. 2 లక్షల ప్రమాద బీమా

► 50 వేల వరకు రుణాలపై వడ్డీ ఉండదు.

జార్ఖండ్‌లోనూ కొత్త పథకం
ఒడిశా తరహాలోనే జార్ఖండ్‌లోనూ ఓ పథకాన్ని రైతుల కోసం సీఎం రఘుబర్‌దాస్‌ శుక్రవారం ప్రారంభించారు. ఈ పథకం కింద రూ. 2,250 కోట్లను ఖర్చు చేయనుండగా, 22.76 లక్షల మంది చిన్న, సన్నకారు రైతులు లబ్ధి పొందనున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రైతులకు ప్రభుత్వం ఏడాదికి రూ. 5,000 ఆర్థిక సాయం అందజేయనుంది. గరిష్టంగా ఐదెకరాల వరకు భూమి ఉన్న రైతులు ఈ సాయం పొందేందుకు అర్హులు. రైతులు విత్తనాలు, ఎరువులు, తదితరాలను సమకూర్చుకునేందుకు ఈ పథకం సాయపడుతుంది.

మరిన్ని వార్తలు