సీఎంతో కలిసి మ్యాచ్‌ వీక్షించిన మాజీ నక్సల్స్‌

14 Dec, 2018 09:54 IST|Sakshi

సాక్షి, భువనేశ్వర్‌: నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి ఒడిశా పోలీసులు ఎంతగానో శ్రమిస్తున్నారు. లొంగిపోయిన నక్సల్స్‌కు పునరావాసంతోపాటు మంచి జీవితం దొరుకుతుందని ప్రచారం చేస్తున్నారు. అయితే లొంగిపోయిన వారు సమాజంలో కలవడానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. అయితే వారిలోని ఈ భావాన్ని పొగొట్టడానికి ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ తన వంతు ప్రయత్నం చేశారు. భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో గురువారం భారత్‌, నెదర్లాండ్‌ మధ్య జరిగిన హాకీ మ్యాచ్‌ను ఆయన లొంగిపోయిన నక్సల్స్‌తో కలిసి వీక్షించారు. దాదాపు 30 మంది మాజీ నక్సల్స్‌ సీఎం పక్కన కూర్చుని మ్యాచ్‌ను చూశారు. వీరిలో 16 మంది మహిళ నక్సలైట్లు ఉన్నారు.

ఇటీవల లొంగిపోయిన నక్సల్స్‌ తమకు హాకీ మ్యాచ్‌ చూడాలని కోరికగా ఉన్నట్టు పోలీసులకు తెలిపారు. వారి కోరిక మేరకు ఇతర ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపిన మల్కాన్‌గిరి ఎస్పీ అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం కళింగ స్టేడియంకు వెళ్లిన మాజీ నక్సల్స్‌ తాము సీఎం పక్కన కూర్చుని మ్యాచ్‌ వీక్షించబోతున్నామనే విషయం తెలుసుకుని మరింత ఆనందపడ్డారు. తమకు ఈ అవకాశం కల్పించినందుకు నవీన్‌ పట్నాయక్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇది తమకు జీవితకాలం గుర్తిండి పోతుందని పేర్కొన్నారు. ఇంకా వారు మాట్లాడుతూ.. ‘ఈ రోజు మేము నిజంగా జనజీవన స్రవంతిలో(సమాజంలో) కలిశామని భావిస్తున్నాం. లొంగిపోయిన నక్సల్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం చాలా తోడ్పాటు అందిస్తుంద’ని తెలిపారు.

మరిన్ని వార్తలు