ఒడిశా ట్రక్కు డ్రైవర్‌కు భారీ చలానా విధించిన అధికారులు

14 Sep, 2019 15:24 IST|Sakshi

భువనేశ్వర్‌: గతంలో ట్రాఫిక్‌ చలానాలు వేలల్లో వస్తేనే వాహనదారులు గుండెలు బాదుకునేవారు. అలాంటిది ఇప్పుడు కొత్త మోటారు వాహన చట్టం-2019 అమల్లోకి వచ్చాక ట్రాఫిక్‌ చలానాలు ఏకంగా లక్షల్లోకి మారిపోయాయి. ఈ నేపథ్యంలో తాజాగా నాగలాండ్‌లో రిజస్టర్‌ అయిన ఓ ఒడిశా ట్రక్కుపై ఏకంగా రూ.6.50లక్షల చలానా విధించారు అధికారులు. అయితే కొత్త ట్రాఫిక్‌ చట్టం అమల్లోకి రాకముందు ఈ భారీ చలానాను విధించడం గమనార్హం. ఒడిశా సంబల్‌పూర్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ట్రక్కుపై ఈ భారీ చలానా విధించారు. గత నెల 10న ఈ సంఘటన చోటు చేసుకుంది. అప్పటికింకా కొత్త మోటారు వాహన చట్టం అమల్లోకి రాలేదు. నూతన చట్టం సెప్టెంబర్‌ 1నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.

మొత్తం ఏడుసార్లు ట్రాఫిక్‌ నియమాలను ఉల్లఘించాడంటూ.. ఆ ప్రాంత ఆర్టీవో రూ. 6.53లక్షల చలానా విధించాడు. వీటిలో గత ఐదేళ్ల నుంచి రోడ్డు ట్యాక్స్‌ కట్టనందుకుగాను.. రూ.6,40,500 చలానా విధించగా.. ఇన్సూరెన్స్‌, పొల్యూషన్‌ వంటి ఇతర కాగితాలు లేకపోవడమే కాక, పర్మిట్‌ షరతులను ఉల్లంఘిచినందుకు గాను మిగతా మొత్తాన్ని విధించారు.
(చదవండి: లుంగీవాలాకు కంగారు పుట్టించే వార్త..)

చనిపోయిన వ్యక్తి లైసెన్స్‌ క్యాన్సిల్‌
ఇదిలా ఉండగా అధికారుల నిర్లక్ష్యానికి అద్దంపట్టే సంఘటన ఒకటి రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. జలవార్‌ జిల్లా ట్రాన్స్‌పోర్టు అధికారులు సీటు బెల్ట్‌ ధరించకపోవడమే కాక, అతివేగంతో వెళ్తున్నాడనే కారణంతో ఓ వ్యక్తి డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేశారు. ఈ మేరకు సదరు వ్యక్తికి నోటీసులు కూడా జారీ చేశారు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. ఏ వ్యక్తి పేరు మీదనైతే నోటీసులు జారీ చేశారో.. అతడు ఏడాది క్రితమే మరణించడం గమనార్హం.

మరిన్ని వార్తలు