Rajasthan Elections 2023: రాజస్థానీలకు కాంగ్రెస్‌ ఏడు గ్యారంటీలు

20 Nov, 2023 20:08 IST|Sakshi

అనుప్‌గఢ్, రాజస్థాన్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రాజస్థాన్ ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ ఏడు గ్యారంటీలను ప్రకటించింది. రాజస్థాన్‌లోని అనుప్‌గఢ్‌లో సోమవారం జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఈ ఏడు హామీలను ప్రకటించారు. కాంగ్రెస్ సామాజిక పథకాలతోపాటు ఆర్థిక సాధికారత దిశగా ఇప్పుడు ప్రకటించిన ఏడు గ్యారంటీలు రాష్ట్రంలో అసమానతలను తొలగించి రాజస్థాన్‌ను మరింత సంపన్నంగా మారుస్తాయని ఖర్గే పేర్కొన్నారు. 

ఖర్గే ప్రకటించిన గ్యారంటీల్లో ప్రధానంగా గృహ లక్ష్మి యోజన హామీ కింద కుటుంబంలో మహిళా పెద్దకు ఏటా రూ. 10వేలు, గౌధన్‌ పథకం కింద పాడి రైతుల నుంచి కిలోకు రూ.2 చొప్పున చెల్లించి ఆవు పేడ కొనుగోలు, ప్రభుత్వ కాలేజీ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌ల పంపిణీ వంటివి ఉన్నాయి. వీటితో పాటు పేద విద్యార్థులకు ఇంగ్లిషు మీడియం విద్య, రూ.500 కంటే తక్కువ ధరకే గ్యాస్ సిలిండర్లు, ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్‌ పునరుద్ధరణ హామీలను మల్లికార్జున ఖర్గే ప్రకటించారు.

అంతకుముందు హనుమాన్‌గఢ్‌లో ప్రచార ర్యాలీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే మాట్లాడుతూ దేశంలో భారీ మౌలిక సదుపాయాలు, విద్యాసంస్థలను నిర్మించిన ఇందిరా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూలను విస్మరించడంపై ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. దేశంలో పెద్ద డ్యామ్‌ల నుంచి ఇంజినీరింగ్‌, మెడికల్‌ కాలేజీల వరకు అన్నింటినీ కాంగ్రెస్సే నిర్మించిందన్నారు. కాంగ్రెస్‌ దేశంలో హరిత విప్లవాన్ని తీసుకొస్తే మోదీ ప్రభుత్వం ఈ దేశాన్ని నాశనం చేస్తోందన్నారు.

మరిన్ని వార్తలు