‘సెప్టెంబర్‌లో భారత్‌కు తొలి రఫేల్‌ విమానం’

4 Jan, 2019 15:40 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంపై శుక్రవారం కూడా లోక్‌సభలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రఫేల్‌ ఒప్పందంపై రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ వివరణ ఇచ్చారు. భారత్‌ కొనుగోలు చేసిన తొలి రఫేల్‌ యుద్ధ విమానం 2019 సెప్టెంబరు నెలలో దేశానికి వస్తుందని  వెల్లడించారు. మిగిలిన విమానాలు 2022 నాటికి అందుబాటులో ఉంటాయని తెలిపారు.

దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని మన ప్రాధాన్యతలకు అనుగుణంగా రక్షణ ఒప్పందాలు కుదుర్చుకుంటామని స్పష్టం చేశారు. అనిల్‌ అంబానీ కోసమే తాము యుద్ధ విమానాలు కొనుగోలు చేశామని కాంగ్రెస్‌ భావిస్తే యూపీఏ హయాంలో జరిగిన ఒప్పందాల వెనుక ఖత్రోచీ, రాబర్ట్‌ వాద్రాలు ఉన్నారంటూ నిర్మలా సీతారామన్‌ దుయ్యబట్టారు.


హెచ్‌ఏఏల్‌కు ఎందుకు ఇవ్వలేదంటే..
ప్రభుత్వ రంగ హెచ్‌ఏఎల్‌కు రఫేల్‌ తయారీ బాధ్యతలు ఎందుకు అప్పగించలేదని కాంగ్రెస్‌ చీఫ్‌  రాహుల్‌గాంధీ ప్రభుత్వాన్ని నిలదీయడంపై నిర్మలా సీతారామన్‌ స్పందించారు. హెచ్‌ఏఎల్‌కు  ఆర్డర్‌ను ఎందుకు ఇవ్వలేదో రాహుల్‌ తెలుసుకోవాలన్నారు. హెచ్‌ఏఎల్‌ గొప్పలే కాదు, లోపాలనూ గుర్తించాలన్నారు.

తేజస్‌ విషయంలో హెచ్‌ఏఎల్‌ మందకొడిగా వ్యవఃహరించిందన్నారు. తాము 43 తేజాస్‌ విమానాలకు ఆర్డర్‌ ఇస్తే హెచ్‌ఏఎల్‌ కేవలం 8 విమానాలనే సమకూర్చిందని చెప్పారు. తమ హయాంలో హెచ్‌ఏఎల్‌ సామర్ధ్యాన్ని రెట్టింపు చేశామని చెప్పుకొచ్చారు. రాహుల్‌ గాంధీ రఫేల్‌పై సభకు తప్పుడు సమాచారం అందించారని అన్నారు. మంత్రి తన పేరును ప్రస్తావించడం పట్ల రాహుల్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు