‘మాజీ సీఎంలకు అధికారిక బంగ్లాలు వద్దు’

7 May, 2018 11:27 IST|Sakshi
మాజీ సీఎంలకు ప్రభుత్వ బంగ్లాల కేటాయింపుపై సుప్రీం సీరియస్‌

సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తర్‌ ప్రదేశ్‌లో మాజీ సీఎంలు ఎవరికీ ప్రభుత్వ బంగ్లాలు కేటాయించరాదని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. పదవీకాలం ముగిసిన సీఎంలకూ అధికారిక బంగ్లాలను కేటాయిస్తూ గతంలో యూపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు సోమవారం కొట్టివేసింది. ఎన్‌జీఓ లోక్‌ప్రహరి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారిస్తూ సుప్రీం కోర్టు ఈ నిర్ణయం వెల్లడించింది. సీఎంగా తమ పదవీకాలం ముగిసిన వారికీ అధికారిక బంగ్లాలను కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఈ పిటిషన్‌ దాఖలైంది. మాజీ సీఎంలకూ ప్రభుత్వ వసతిని కొనసాగిస్తూ యూపీ ప్రభుత్వం చేపట్టిన సవరణను సుప్రీం కోర్టు కొట్టివేసింది.

యూపీ సర్కార్‌ తీసుకువచ్చిన చట్ట సవరణ వివక్షతో కూడినదని, రాజ్యాంగం నిర్ధేశించిన సమానత్వ సూత్రానికి విరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది. ప్రస్తుతం యూపీలో మాజీ సీఎంలు అఖిలేష్‌ యాదవ్‌, ములాయం సింగ్‌ యాదవ్‌, మాయావతి, రాజ్‌నాథ్‌ సింగ్‌, కళ్యాణ్‌ సింగ్‌, ఎన్‌డీ తివారీలు ప్రభుత్వ బంగ్లాలను తమ స్వాధీనంలో ఉంచుకున్నారు.

>
మరిన్ని వార్తలు