లక్షల్లో నర్సరీ ఫీజు.. పేరెంట్‌ ఓరియెంటేషన్‌ చార్జీలు అదనం..!

9 Dec, 2023 13:19 IST|Sakshi

కోకాపేటలోని ఓ అంతర్జాతీయ పాఠశాలలో ఈ సంవత్సరం 4వ తరగతికి రూ.1.23 లక్షల ఫీజు ఉంది. వచ్చే ఏడాది అయిదో తరగతిలో చేరాలంటే రూ.1.58 లక్షలు చెల్లించాలని తల్లిదండ్రులకు మెసెజ్‌ వెళ్లింది. అంటే పైతరగతికి అదనంగా రూ.35 వేలు (28 శాతం) పెరిగింది.

ఉప్పల్‌ చౌరస్తా సమీపంలోని ఓ ప్రముఖ పాఠశాలలో చాలా  వాటితో పోలిస్తే అక్కడ కొంత రుసుములు తక్కువనే పేరుంది. అయినా ఈసారి ఒకటో తరగతిలో ప్రవేశానికి 14 శాతం పెంచడం గమనార్హం. అక్కడ ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఒకటో తరగతిలో చేరేందుకు రూ.50 వేలు ఫీజు నిర్ణయించగా.. వచ్చే ఏడాదికి దాన్ని రూ.57 వేలకు పెంచారు. 

పాఠశాల ఫీజులు లక్షల్లో ఉంటున్నాయి. డిజీ తరగతులు, ఏసీ క్లాస్‌రూం, టెక్నాలజీ నేర్పుతున్నామని చెబుతూ యాజమాన్యాలు లక్షల్లో బాదుతున్నారు. అవి ఎందుకు కడుతున్నారో తల్లిదండ్రులకు సరైన వివరాలు అందుబాటులో ఉండవు. పాఠశాల యాజమాన్యం ఫలానా మొత్తం చెల్లించాలని చెప్పగానే.. వీలైతే కొంత బేరమాడి, లేదంటే వారు చెప్పినంత ముట్టజెప్పడం అలవాటైంది. కానీ పాఠశాలకు చెల్లిస్తున్న ఫీజులో అడ్మిషన్‌ ఫీజు, డెవలప్‌మెంట్‌ ఫీజు, ట్రావెల్‌ చార్జీలు, కాషన్‌ మనీ, వార్షిక చార్జీలు.. ఇలా రకరకాలుగా విభజించి తల్లిదండ్రులపై భారం మోపుతున్నారు. తాజాగా ఓ స్కూల్‌ యాజమాన్యం 2024-25 విద్యాసంవత్సరానికిగాను నర్సరీ, జూనియర్‌ కేజీకి ఏకంగా రూ.1,51,656  వసూలు చేస్తుంది. అందుకు అదనంగా ‘పేరెంట్‌ ఓరియంటేషన్‌’ పేరుతో రూ.8,400 చెల్లించాలని కోరింది. అయితే అందుకు సంబంధించిన ఫీజు వివరాలతో ఉన్న కాపీ ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. 

ఫీజుల వినియోగం ఇలా...

విద్యాసంస్థల్లో గరిష్ఠంగా ఎంత ఫీజు వసూలు చేయాలనే నిర్ణయంతో పాటు... వసూలు చేసిన ఫీజులను ఎలా వినియోగించాలో ప్రభుత్వం తెలిపింది.

ఇదీ చదవండి: ఆ సిటీలో 8,500 ఎకరాల్లో సోలార్‌ప్లేట్లతో పార్కింగ్‌ స్థలం

నిబంధనల ప్రకారం స్కూళ్లు, కాలేజీ యాజమాన్యాలు వసూలు చేసిన ఫీజుల్లో 50 శాతాన్ని టీచర్లు, నాన్ టీచింగ్ స్టాప్ వేతనాలకు, మరో 15 శాతాన్ని గ్రాట్యుటీ, పీఎఫ్‌, గ్రూప్‌ ఇన్సూరెన్స్‌కు ఖర్చు చేయాలి. అలాగే మరో 20 శాతం ఫీజును పాఠశాల లేదా కళాశాల అభివృద్ధికి వినియోగించాలి. అలాగే ఆయా విద్యాసంస్థల్లో పని చేస్తున్న టీచర్లు, లెక్చరర్లు వివరాలతో పాటు వారి విద్యార్హతలు, వారికి ఇస్తున్న జీతాల సమాచారాన్ని విద్యాశాఖకు తెలియజేయాలి. దానికి సంబంధించిన పూర్తి వివరాలను విద్యాసంస్థల వెబ్ సైట్లలో అందుబాటులో ఉంచాలి.

>
మరిన్ని వార్తలు