Jabalpur Railway Station: రైల్వే స్టేషన్‌లో చీకట్లు... లగేజీలు చోరీ, పడిపోయిన ‍ప్రయాణికులు!

9 Dec, 2023 13:48 IST|Sakshi

అది మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ రైల్వేస్టేషన్‌.. తాము ఎక్కబోయే రైలు కోసం ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు. ఇంతలో హఠాత్తుగా స్టేషన్‌లో కరెంట్‌ పోయింది. ప్రయాణికులకు మొదట ఏమీ అర్థం కాలేదు. చాలా సేపు ఇదే పరిస్థితి నెలకొనడంతో స్టేషన్‌లో గందరగోళం ఏర్పడింది. 

జబల్‌పూర్ ప్రధాన స్టేషన్‌లోని విద్యుత్ వ్యవస్థ మొత్తం కుప్పకూలడంతో ప్లాట్‌ఫారమ్ నంబర్ వన్‌ నుంచి ప్లాట్‌ఫామ్‌ ఆరు వరకు స్టేషన్ ఆవరణ అంతా అంధకారమయం అయ్యింది. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో టికెట్‌ కౌంటర్‌ కూడా మూతపడింది. ఇది చూసిన ప్రయాణికులు నానా హంగామా చేశారు. ఈ ఘటన జరిగి రెండు రోజులైనా దీనికి బాధ్యులెవరనేది అధికారులు తేల్చలేదు. 

స్టేషన్ మొత్తంమీద గంటల తరబడి విద్యుత్‌ లేకపోవడంతో  చాలా మంది ప్రయాణికుల సామాను చోరీకి గురయ్యింది. చీకటిమాటున దొంగలు రెచ్చిపోయారు. చీకటిలో ఎదుట ఏమున్నదో తెలియక  పలువురు ప్రయాణికులు నడిచేటప్పుడు పడిపోయారు. ఈ ఘటన అనంతరం సంబంధిత శాఖ ఇంజినీర్లు మరమ్మతులు చేపట్టారు. గంట తరువాత తిరిగి విద్యుత్‌ పునరుద్ధరణ జరిగింది.

స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్యానెల్‌లో లోపం కారణంగా, ప్లాట్‌ఫారమ్‌తో సహా మొత్తం స్టేషన్ ప్రాంగణం, వివిధ రైల్వే విభాగాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జనరేటర్‌ను ఉపయోగించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఎట్టకేలకు ప్యానల్‌కు మరమ్మతులు చేసిన తర్వాత విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరిగింది. 
ఇది కూడా చదవండి: ఒడిశా, బీహార్‌ గుణపాఠాల తర్వాత రైల్వేశాఖ ఏం చేస్తున్నదంటే..

>
మరిన్ని వార్తలు