'కాంగ్రెస్ డిమాండ్ తప్పుకాదు.. కరెక్టే'

25 Apr, 2016 13:53 IST|Sakshi

న్యూఢిల్లీ: అవకాశం దొరికినప్పుడల్లా బీజేపీపై విమర్శలకు దిగే శివసేన పార్టీ మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీని వెనుకేసుకొచ్చింది. ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన విధింపు అంశంపై పార్లమెంటులో చర్చ జరగాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డిమాండ్ సరైనదేనని శివసేన నేత సంజయ్ రావత్ అన్నారు. ఈ విషయం నుంచి కేంద్రం పక్కకు జరిగితే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయని హెచ్చరించారు.

'పార్లమెంటులో ఒక అంశాన్ని చర్చకు అంగీకరించకుండా పార్లమెంటు సమావేశాలను ముందుకు నడిపించాలని చూస్తే ప్రజలు మీకు మద్దతు ఇవ్వరు. మీరు చెప్పే కారణాన్ని మెచ్చుకోరు. శివసేన కావచ్చు.. కాంగ్రెస్ కావచ్చు. ఒక ముఖ్యమంత్రికి తన మెజార్టీ నిరూపించుకునే అవకాశం ఇవ్వాలి. కానీ, ఉత్తరాఖండ్లో అలా జరగలేదు. అందుకే ఈ విషయంపై చర్చించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఇది సరైనదే' అని ఆయన సోమవారం ఓ మీడియాతో అన్నారు. ప్రస్తుతం ఈ అంశం న్యాయవ్యవస్థ పరిధికి వెళ్లిందికదా అని ప్రశ్నించగా.. అది కోర్టు విచారణలో ఉందేమోకానీ.. అంతకంటే ముందుకు రాజకీయ పరంగా ఎంతో ముఖ్యమైన అంశం అని ఆయన బదులిచ్చారు. 

మరిన్ని వార్తలు