లోక్సభలో 'జీఎస్టీ' రగడ..విపక్షాల వాకౌట్

24 Apr, 2015 14:43 IST|Sakshi
సభ నుంచి బయటికి వెళుతోన్న విపక్ష ఎంపీలు

వస్తువులు, సేవల పన్ను (జీఎస్ టీ) చట్టానికి సవరణల బిల్లుపై లోక్సభ అట్టుడికింది. శుక్రవారం సభ ప్రారంభమైన వెంటనే బిల్లుపై చర్చను ప్రారంభిస్తున్నట్లు ప్రకటన వెలువడటంతో సభలో దుమారం చెలరేగింది. చర్చను వ్యతిరేకిస్తూ విపక్షాలన్నీ  మూకుమ్మడిగా వాకౌట్ చేశాయి.

'స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలపకముందే సవరణల బిల్లుపై సభలో ఎలా చర్చిస్తారు?' అంటూ కాంగ్రెస్ ఎంపీ భూపేంద్రసింగ్ హుడా ఆందోళనకు దిగారు. 'ఇదే తీరును కొనసాగిస్తే అసలు పార్లమెంటరీ కమిటీల ఏర్పాటు ఎందుకు?' అంటూ లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. 'జీఎస్ టీ చట్టానికి సవరణల వల్ల జీడీపీ రెండు శాతం మేర వృద్ధి చెందడమేకాక అనేక ప్రయోజనాలు కలుగుతాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సభ్యులకు వివరించే ప్రయత్నం చేశారు. చర్చకు సహకరించాల్సిందిగా విపక్షాలను కోరారు.

ఇప్పటికే భూసేకరణ చట్టానికి సవరణల విషయంలో విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వం..  తాజాగా జీఎస్టీ చట్టానికి సవరణ విషయంలోనూ విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత చవిచూడాల్సి వస్తోంది. గతవారం ఢిల్లీలో జరిగిన ఆర్థిక మంత్రుల సమావేశంలో పాల్గొన్న తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్.. రాష్ట్రాలకు చెల్లించాల్సిన సీఎస్‌టీ బకాయిలు చెల్లించిన తర్వాతే వస్తువులు, సేవల పన్ను(జీఎస్‌టీ)ను అమలు చేయాలని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు