అందుకే భారత్‌లో టీబీ ఇంతలా..

25 Aug, 2016 18:06 IST|Sakshi
అందుకే భారత్‌లో టీబీ ఇంతలా..
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యధికంగా క్షయ(ట్యుబరిక్యులోసిస్) వ్యాధి ప్రభావానికి లోనవుతున్న దేశం మనదే. ఇది ముఖ్యంగా ఊపిరితిత్తులపై దాడి చేసే బ్యాక్టీరియా కారక అంటువ్యాధి. భారత్‌లో ఈ వ్యాధి ఇంతలా ప్రభావం చూపడానికి కారణం ఇక్కడ అవలంభిస్తున్న ఔషధ విధానాలే అని కెనడాలోని మెక్గిల్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన తాజా పరిశీలనలో తేలింది. 
 
ప్రపంచంలో అత్యధికంగా యాంటీ బయాటిక్స్ వినియోగిస్తున్న దేశం ఇండియానే. అయితే.. ఈ యాంటీ బయాటిక్స్ మితిమీరిన వాడకం మూలంగానే భారత్‌లో క్షయ వ్యాధి మందులకు లొంగకుండా తయారవుతుందని పరిశోధనకు నేతృత్వం వహించిన మధుకర్ పాయ్ వెల్లడించారు. ఇక్కడి ఫార్మసిస్టులు క్షయ వ్యాధి లక్షణాలు గల వారికి ఎలాంటి ఔషధాలు ఇస్తున్నారు అనే అంశంలో నిర్వహించిన పరిశీలనలో నివ్వెరపరిచే విషయాలు వెల్లడయ్యాయి.

పూర్తిగా క్షయ వ్యాధి లక్షణాలతో ఉన్నవారికి ఫార్మిసిస్టులు సాధారణ యాంటీ బయాటిక్స్ ఇస్తున్నారని పరిశోధకులు  గుర్తించారు. సరిగ్గా క్షయ వ్యాధి నిర్మూలనకు ఉపయోగపడే ఫస్ట్‌లైన్ యాంటీ టీబీ డ్రగ్స్(ఐసోనియాజిడ్, రిఫాంపిసిన్, ఇథాంబుటాల్, స్ట్రెప్టోమైసిన్)ను ఫార్మసిస్టులు ఇవ్వడంలేదని గుర్తించారు. డాక్టర్‌ల ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడుతున్న యాంటీ బయాటిక్స్ మూలంగా రోగులకు తీవ్ర హాని కలగడంతో పాటు.. భవిష్యత్తులో టీబీ మందులకు లొంగకుండా తయారవుతోందని పరిశోధకులు వెల్లడించారు.
 
మరిన్ని వార్తలు