50 మంది సైనికులపై వలపు వల

14 Jan, 2019 04:34 IST|Sakshi

ఫేస్‌బుక్‌ ద్వారా సంభాషించిన పాకిస్తానీ మహిళ

రాజస్తాన్‌లో ఓ జవాన్‌ అరెస్టు  

న్యూఢిల్లీ: భారత ఆర్మీకి సంబంధించిన కీలక వివరాలను సేకరించేందుకు పాకిస్తానీ మహిళ 50 మంది జవాన్లపై వల వేసిన సంగతి తాజాగా వెలుగులోకి వచ్చింది. సున్నితమైన సమాచారాన్ని ఆమెతో పంచుకోవడంతో సోమ్‌వీర్‌ సింగ్‌ అనే సిపాయిని ఆర్మీ ఇప్పటికే అరెస్టు చేసింది. ఫేస్‌బుక్‌లో అనికా చోప్రా పేరుతో ఖాతా తెరిచి, ఆకుపచ్చ రంగు చీర కట్టుకున్న ఫొటోను ప్రొఫైల్‌కు పెట్టి సదరు మహిళ జవాన్లకు వలపు వల విసిరింది. మిలిటరీ నర్సింగ్‌ విభాగంలో ఆర్మీ కెప్టెన్‌గా  పనిచేస్తున్నట్లు చెప్పుకుంది.

సోమ్‌వీర్‌ను అరెస్టు చేయడంతోపాటు మిగతా జవాన్లను కూడా ఆర్మీ ప్రస్తుతం విచారిస్తోంది. రాజస్తాన్‌లోని జైçసల్మేర్‌లో విధులు నిర్వర్తిస్తున్న సోమ్‌వీర్‌కు 2016లో ఈ మహిళ స్నేహ అభ్యర్థనను పంపి సంభాషించడం మొదలుపెట్టింది. త్వరలోనే వారి మాటలు హద్దులు దాటాయి. ఓ దశలో సోమ్‌వీర్‌ తన భార్యకు విడాకులివ్వాలని కూడా నిర్ణయించుకున్నాడు. అయితే, ఐదు నెలలుగా జమ్మూ నుంచి సోమ్‌వీర్‌కు ఎక్కువగా ఫోన్‌కాల్స్‌ వస్తుండటంతో ఆర్మీకి అనుమానం వచ్చి అతని సామాజిక మాధ్యమ ఖాతాలపై ఓ కన్నేసింది.

ఫేస్‌బుక్‌లో సదరు మహిళతో అతని చాటింగ్‌ను ఓ కంట కనిపెడుతూనే ఉంది. ఆమె పాకిస్తాన్‌ నుంచి ఫేస్‌బుక్‌ను వాడుతున్నట్లుగా నిర్ధారించుకుంది. సంభాషణల్లో తొలుత నీ పోస్టింగ్‌ ఎక్కడ లాంటి ప్రశ్నలతో మొదలుపెట్టి ట్యాంక్‌ ఫొటోలు పంపించమని ఆమె అడిగిందనీ, ఇది ఆమె పన్నిన వల అని తెలియని సోమ్‌వీర్‌ కొన్ని వివరాలు ఆమెకు తెలిపాడని అధికారులు చెప్పారు. అనంతరం ఆమె సోమ్‌వీర్‌ను బ్లాక్‌మెయిల్‌ చేయడం ప్రారంభించిందనీ, ఆ తర్వాత సమాచారం ఇచ్చినందుకు బదులుగా సోమ్‌వీర్‌ డబ్బు తీసుకుంటున్నాడని తెలిపారు. ఇలా మొత్తం 50 మంది జవాన్లపై పాక్‌ మహిళ ఫేస్‌బుక్‌ ద్వారా వల వేసింది. ఒక్కో జవాన్‌కు ఒక్కో సమయాన్ని కేటాయించి, ఆ సమయంలోనే ఆమె మాట్లాడేదని దర్యాప్తులో వెల్లడయింది.

మరిన్ని వార్తలు