ఫలప్రదంగా జరిగాయ్‌!!

11 Aug, 2018 03:02 IST|Sakshi
రాజ్యసభ కార్యకలాపాలు నిర్వహిస్తున్న డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌

ఫలప్రదంగా జరిగాయన్న లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా

21 బిల్లులకు ఆమోదం

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు శుక్రవారంతో ముగిసి, నిరవధికంగా వాయిదాపడ్డాయి. జూలై 18వ తేదీ నుంచి మొదలయిన ఈ సమావేశాల సందర్భంగా ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. దీంతోపాటు కీలకమైన ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణ బిల్లును పార్లమెంట్‌ ఆమోదించింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక అనంతరం ప్రధాని మోదీ చేసిన ప్రసంగంలో అభ్యంతరకర వ్యాఖ్యలుండటంతో వాటిని రికార్డుల నుంచి తొలగించటం గమనార్హం. అయితే, ప్రభుత్వం ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును రాజ్యసభలో మెజారిటీ లేనికారణంగా ప్రవేశపెట్టలేకపోయింది. ఈ సమావేశాల్లో లోక్‌సభ కార్యకలాపాలు ఫలవంతంగా సాగడంపై స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సంతృప్తి వ్యక్తం చేశారు.  

అవిశ్వాసం.. కీలక బిల్లులు
గత బడ్జెట్‌ సమావేశాలతో పోలిస్తే ఈసారి ‘సంతృప్తికరం, ఫలప్రదం’గా జరిగాయని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ఓడిపోయింది. ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణ బిల్లు, జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించే కీలక బిల్లులతోపాటు అవినీతి నిరోధక, క్రిమినల్‌ లా, ఆర్థిక ఎగవేతదారుల బిల్లు, బాలలకు ఉచిత, నిర్బంధ హక్కు బిల్లు, మనుషుల రవాణా వ్యతిరేక బిల్లు వంటివి 21 బిల్లులు ఆమోదం పొందాయన్నారు. ఈ సమావేశాల్లో సభ్యులు అడిగిన 4,140 ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇచ్చిందన్నారు. ఇందులో 75 ప్రశ్నలకు సభలో మంత్రులు సమాధానం ఇచ్చారని తెలిపారు. పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ అందజేసిన 62 నివేదికలతోపాటు సభ్యులు 128 ప్రైవేట్‌ బిల్లులను ప్రవేశపెట్టారని వివరించారు.  వివిధ అంశాలపై సభ్యుల నిరసనల కారణంగా 27 గంటల సభాకాలం వృథా అయింది.  

‘ట్రిపుల్‌ తలాక్‌’ను చర్చించని రాజ్యసభ
రాఫెల్‌ ఒప్పందంపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ వేయాలంటూ కాంగ్రెస్‌ పట్టుబట్టడంతో శుక్రవారం రాజ్యసభ సజావుగా సాగలేదు. త్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు సవరణలు చేయాలని, పార్లమెంట్‌ సెలక్ట్‌ కమిటీ పరిశీలనకు పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేయడంతో చర్చకు తీసుకోవట్లేదని రాజ్యసభ చైర్మన్‌ ప్రకటించారు. త్వరలో దీనిపై ఆర్డినెన్స్‌ తేవాలని ప్రభుత్వం యోచిస్తోందని సమాచారం. దీంతోపాటు ఎస్సీ, ఎస్టీలకు దేశవ్యాప్తంగా ఒకే విధమైన సౌకర్యాలు, రిజర్వేషన్లు కల్పించేలా రాజ్యాంగాన్ని సవరించాలంటూ సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు విశంభర్‌ ప్రసాద్‌ నిషాద్‌ ప్రవేశపెట్టిన బిల్లును సభ తిరస్కరించింది.  

అత్యంత ఫలప్రదం
జూలై 18వ తేదీ నుంచి మొదలైన వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాలు అత్యంత ఫలప్రదంగా సాగాయి. ఈ సెషన్‌లో భాగంగా 24 రోజుల్లో 17 సార్లు సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో ఎజెండా ప్రకారం లోక్‌సభ 118 శాతం, రాజ్యసభ 74 శాతం సమర్ధంగా నడిచింది. లోక్‌సభ 21 బిల్లులు, రాజ్యసభ 14 బిల్లులను ఆమోదించాయి. 21 బిల్లులను ఉభయ సభలు ఆమోదించాయి. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో పేర్కొన్న 22 భాషల్లో అనువాదకుల సాయంతో ఏకకాలంలో వినే సౌకర్యం సభ్యులకు మొదటిసారిగా కల్పించారు.  ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా, ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణ బిల్లులను ఆమోదించిన ఈ సమావేశాలను సామాజిక న్యాయ ఉత్సవంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్‌ అభివర్ణించారు.  ఈ సమావేశాలు అత్యంత ఫలప్రదంగా సాగటం 2000 సంవత్సరం తర్వాత  ఇదే ప్రథమమని పీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రీసెర్చి సంస్థ పేర్కొంది. 16వ లోక్‌సభలో ఇదే రికార్డు. మొత్తం బిల్లుల్లో 26శాతం మాత్రమే పార్లమెంటరీ కమిటీల పరిశీలనకు ప్రభుత్వం పంపగా ఇది 15వ లోక్‌సభలో 71శాతం, 14వ లోక్‌సభలో 60శాతం వరకు ఉంది. మొత్తం 999 ప్రైవేట్‌ బిల్లులను సభలో ప్రవేశపెట్టడం కూడా 2000 సంవత్సరం తర్వాత ఇదే ప్రథమం.

రికార్డుల నుంచి ప్రధాని వ్యాఖ్యలు తొలగింపు
కాంగ్రెస్‌ సభ్యుడు బీకే హరిప్రసాద్‌పై ప్రధాని మోదీ గురువారం చేసిన వ్యాఖ్యలను అభ్యంతరకరమైనవిగా భావిస్తూ రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య చెప్పారు. మోదీ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించడం అధికార పార్టీని తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టినట్లయింది. ప్రధాని మాటలను, అభ్యంతరకరంగా ఉన్నాయనే ఆరోపణలతో రికార్డుల నుంచి తీసివేయడం  దేశ పార్లమెంటరీ చరిత్రలో ఇదే తొలిసారని రాజ్యసభ వర్గాలు అంటున్నాయి. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ అభ్యర్ధిగా ప్రతిపక్షం బలపరిచిన హరిప్రసాద్‌పై ఎన్‌డీఏ అభ్యర్ధి హరివంశ్‌ గెలుపు సందర్భంగా మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా హరిప్రసాద్‌ పేరులోని ‘బి.కె.’ కలిసి వచ్చేలా అమర్యాదకరమైన 3 హిందీ పదాలను వాడారు. దీంతో ఆ వ్యాఖ్యలను తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. మంత్రి రాందాస్‌ అథవలే చేసిన వ్యాఖ్యలను కూడా రికార్డుల నుంచి తొలగించినట్లు రాజ్యసభ వర్గాలు తెలిపాయి.
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా