బీసీ కమిషన్‌ బిల్లులో ఏముంది?

8 Aug, 2018 14:50 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ వెనకబడిన వర్గాల కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించే బిల్లుకు రాష్ట్రపతి సంతకం చేయడమే ఇక తరువాయి. చట్టం అమల్లోకి వస్తుంది. ఈ చట్టానికి సంబంధించిన 123వ రాజ్యాంగ సవరణ బిల్లును రాజ్యసభ సోమవారం నాడు ఆమోదించిన విషయం తెల్సిందే. లోక్‌సభ అంతకుముందు ఎప్పుడో ఈ బిల్లును ఆమోదించింది. వాస్తవానికి 2017లోనే ఈ బిల్లు రాజ్యసభ ముందుకు వచ్చింది. అప్పటికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రాజ్యసభలో పూర్తి మెజారిటీ లేదు. పైగా రాజ్యాంగ సవరణ బిల్లుకు మూడింట రెండు వంతుల సభ్యుల మద్దతు కావాలి. అప్పట్లో బిల్లుకు కావాల్సిన మెజారిటీని సమీకరించలేక పోవడం బీజేపీ ప్రభుత్వాన్ని కాస్త ఇబ్బందికి గురి చేసింది. అప్పటికే ఆమోదించినట్లయితే నిజంగా బీసీల తరఫున నిలబడేది తామేనంటూ భుజాలు చరుచుకునే అవకాశం ఉండేది. ఇప్పటికైనా మించి పోయిందేమీ లేదుగానీ తమ ప్రభుత్వ విజయంగా దీన్ని చాటుకునేందుకు ఎక్కువ చాటింపు వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రాజ్యసభ ఈ బిల్లును ఒక్క ప్రతికూలమైన ఓటు లేకుండా 156 ఓట్ల మద్దతుతో ఆమోదించడమే.

123వ రాజ్యాంగ సవరణ అంటే ఏమిటీ?
1993లో జాతీయ వెనకబడిన వర్గాల కమిషన్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. సమాజంలో సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన వర్గాలను గుర్తించి, వారిని బీసీ జాబితాలో చేర్చుకోవాలా, వద్దా అని నిర్ణయించడం, వాటికి సంబంధించిన ఫిర్యాదులను విచారించడం, ఈ అంశాలకు సంబంధించి అవసరమైన చర్యల కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు తగిన సిఫార్సులు చేయడం ఈ కమిషన్‌ బాధ్యతలు. అయితే కమిషన్‌ సిఫార్సులను అమలు చేయడం, అమలు చేయకపోవడం ప్రభుత్వ విధాన నిర్ణయం పరిధిలోకి వస్తుంది. ఇప్పుడు 123వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించారు.

కొత్తగా వచ్చే అధికారాలేమిటీ?
బిల్లులోని 338బీ అధికరణం ప్రకారం ఇతర వెనకబడిన వర్గాలకు కల్పించిన రక్షణ ప్రమాణాలు ఏ మేరకు శక్తివంతంగా ఉన్నాయో తెలుసుకునేందుకు వాటిని పర్యవేక్షించడం, దర్యాప్తు జరిపే అధికారాలు కమిషన్‌కు ఉంటాయి. అందుకోసం సివిల్‌ కోర్టు అధికారాలు ఉంటాయి. ఈ ఓబీసీలకు సంబంధించి ఎలాంటి విధాన పరమైన నిర్ణయం తీసుకోవాలన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిగా ఈ కమిషన్‌ను సంప్రతించాల్సి ఉంటుంది. రాజ్యాంగం మేరకు సామాజికంగా, విద్యాపరంగా బీసీలకు సిద్ధించిన హక్కులు, రక్షణ ప్రమాణాలకు సంబంధించిన ఫిర్యాదులను విచారించే అధికారం కమిషన్‌కు ఇక నుంచి ఉంటుంది. ఈ విషయమై విచారించాల్సిన వ్యక్తి దేశంలో ఎక్కడున్న పిలిపించే హక్కు కమిషన్‌కు ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాల నుంచే కాకుండా పోలీసు స్టేషన్, కోర్టుల నుంచి కూడా తమకు అవసరమైన డాక్యుమెంట్లను తెప్పించుకునే అధికారం కమిషన్‌కు ఉంటుంది. అలాగే సామాజికంగా, ఆర్థికంగా ఇతర వెనకబడిన వర్గాల అభ్యున్నతికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. వెనకబడిన వర్గాల అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను జాతీయ బీసీల కమిషన్‌ ఏటా సమీక్షించి, వాటిపై తీసుకోవాల్సిన చర్యల గురించి సిఫార్సు చేస్తూ రాష్ట్రపతికి ఓ నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ఆ రాష్ట్రపతి ఆ నివేదికను పరిశీలించి చర్యల నివేదికతోపాటు దాన్ని పార్లమెంట్‌కు సమర్పించాల్సి ఉంటుంది. దానిపై ప్రభుత్వం స్పందించాల్సి ఉంటుంది.

కమిషన్‌లో ఎవరెవరుంటారు?
ఓ చైర్‌పర్సన్, ఓ వైస్‌ చైర్‌పర్సన్, ముగ్గురు సభ్యులు ఉంటారు. సభ్యుల పదవీకాలాన్నీ, వారి సర్వీసు నియమ నిబంధనలను రాష్ట్రపతి నిర్ణయిస్తారు. కమిటీలోకి తప్పనిసరిగా ఓ మహిళను తీసుకోవాలని ప్రతిపక్షం డిమాండ్‌ చేయగా, నియమ నిబంధనల ఖరారు సమయంలో దీన్ని పరిశీస్తామని కేంద్ర ప్రబుత్వం హామీనిచ్చింది. ఈ బిల్లు చరిత్రాత్మకమని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా వర్ణించగా, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి అణచివేతకు గురవుతూ వస్తున్న బీసీలకు ఈ బిల్లు ద్వారా న్యాయం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. దేశ జనాభాలో 52 శాతం ఉన్న బీసీలకు బిల్లుతో ప్రయోజనం కలిగించడం ద్వారా బీజేపీ రాజకీయంగా లబ్ధిపొందే అవకాశాలు ఉన్నాయని సామాజిక విశ్లేషకులు భావిస్తున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా