పెట్రో మంట నుంచి కాస్త ఊరట

5 Oct, 2018 04:13 IST|Sakshi

లీటర్‌కు రూ.2.50 తగ్గించిన కేంద్రం

స్థానిక పన్నులు తగ్గించుకోవాలని రాష్ట్రాలకు సూచన

న్యూఢిల్లీ: రోజుకో రికార్డు చెరిపేస్తూ దూసుకెళ్తున్న ఇంధన ధరల నుంచి సామాన్యునికి కొంత ఊరట లభించింది. పెట్రోల్, డీజిల్‌ లీటరు ధరను కేంద్రం రూ.2.50 తగ్గించింది. ఇందులో రూ. 1.50 మేర ఎక్సైజ్‌ సుంకం రూపంలో కోత విధించగా, మరో రూపాయి తగ్గింపును చమురు కంపెనీలు సర్దుబాటుచేసుకోనున్నాయి. కేంద్రం నిర్ణయం వెలువడిన వెంటనే బీజేపీ పాలిత రాష్ట్రాలు గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, అస్సాం, త్రిపురలు రూ.2.50 మేర వ్యాట్‌ తగ్గించుకోవడంతో ఆ రాష్ట్రాల్లో మొత్తం తగ్గింపు రూ.5కు చేరింది.

సవరించిన ధరలు గురువారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. తాజా నిర్ణయంతో కేంద్రం మిగిలిన ఆర్థిక సంవత్సరంలో రూ.10,500 కోట్లు, పూర్తి సంవత్సరంలో రూ.21,000 కోట్ల ఆదాయం కోల్పోనుంది. చమురు కంపెనీలు లీటరుకు రూ.1 చొప్పున భారం భరిస్తే సుమారు రూ.10,700 కోట్ల ఆదాయాన్ని నష్టపోతాయి. ఇందులో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) సగం, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్‌లు మిగతా సగాన్ని సమానంగా భరించనున్నాయి.   ప్రభుత్వ నిర్ణయం కంటితుడుపు చర్యేనని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ విమర్శించింది.

డీరెగ్యులేషన్‌పై ప్రభావం లేదు: జైట్లీ
రాష్ట్రాలు కూడా స్థానిక పన్నులు తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ విజ్ఞప్తి చేశారు. ఇంధన భారాన్ని పంచుకోవాలని చమురు కంపెనీలను కోరడం మళ్లీ ప్రభుత్వ నియంత్రణకు దారితీస్తుందన్న ఆందోళనలను ఆయన కొట్టిపారేశారు. కంపెనీలకు ధరలు నిర్ణయించుకునే స్వేచ్ఛ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

>
మరిన్ని వార్తలు