మళ్లీ స్వల్పంగా తగ్గిన పెట్రో ధరలు

19 Oct, 2018 09:39 IST|Sakshi

ఢిల్లీ: ఇటీవల పెరుగుతూ వచ్చిన చమురు ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా రెండోరోజు స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌పై 24 పైసలు, డీజిల్‌పై 10 పైసలు తగ్గింది. దీంతో అక్కడ లీటర్‌ పెట్రోల్‌ రూ.82.38, డీజిల్‌ రూ. 75.48కి చేరింది. ముంబయిలో పెట్రోల్‌పై 24 పైసలు, డీజిల్‌పై 11 పైసలు తగ్గడంతో పెట్రోల్‌ రూ. 87.74, డీజిల్‌ రూ. 79.13గా కొనసాగుతోంది.

గురువారం సైతం పెట్రో ధరలు మోస్తరుగా తగ్గిన సంగతి తెలిసిందే. గ్లోబల్‌గా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరిగినప్పటికీ దేశీయంగా చమురు ధరలు దిగిరావడం విశేషం. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించినప్పటికీ, ఈ ధరలు తగ్గడం అంతంత మాత్రంగానే ఉంది.  అయితే దసరా కానుకగా ఈ ధరలు దిగిరావడం వాహనదారులకు కాస్త ఉపశమనం కలిగించినట్టు అయింది. ఆగస్టు మధ్య నుంచి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. క్రూడాయిల్‌ ధరలు పెరగడం, రూపాయి విలువ పడిపోవడం ఈ ధరల పెంపుకు కారణమవుతోంది.

ఢిల్లీ పెట్రోల్‌ డీలర్స్‌ సమ్మె...

పెట్రోల్‌ ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాన్ని తగ్గించాల్సిందిగా డిమాండ్‌ చేస్తూ ఢిల్లీ పెట్రోల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ ఒక రోజు పాటు సమ్మె చేయనున్నట్లు ప్రకటించింది. అక్టోబరు 22 ఉదయం ఆరు గంటల నుంచి అక్టోబరు 23 ఉదయం ఐదు గంటల వరకు సమ్మె చేస్తామని తెలిపింది. సమ్మెలో భాగంగా ఢిల్లీలోని పెట్రోల్‌ బంకులు ఆ ఒక్క రోజు మూతపడనున్నాయి.

దసరా కానుకగా పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు తగ్గింపు

 
 

మరిన్ని వార్తలు