పీజీఐఎమ్‌ఈఆర్‌ ఆస్పత్రిలో ఫలించిన ప్లాస్మా థెరపీ

13 Jun, 2020 10:34 IST|Sakshi
ప్లాస్మా థెరపీతో కోలుకుని డిశ్చార్జ్‌ అవుతున్న 60 ఏళ్ల వ్యక్తికి శుభాకాంక్షలు తెలపుతున్న పీజీఐ చంఢీగర్‌ వైద్యులు

చండీగఢ్‌‌: కరోనా పేషంట్ల పాలిట ఆశాదీపంగా కనిపిస్తోన్న ప్లాస్మా థెరపీతో ఓ అరవై ఏళ్ల వ్యక్తి కోలుకుని డిశ్చార్జ్‌ అయిన సంఘటన చండీగఢ్‌‌ పీజీఐ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. కురుక్షేత్రకు చెందిన 60 ఏళ్ల వ్యక్తి న్యూమోనియా కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యి.. ఆక్సిజన్‌ థెరపీ అవసరమైన స్థితిలో ఆస్పత్రికి వచ్చాడు. వైద్యులు అతడికి ప్లాస్మా థెరపీ, ఇతర చికిత్సలు అందించారు. ఫలితంగా మూడు రోజుల్లోనే అతడికి ఆక్సిజన్‌ థెరపీని నిలిపివేయడమే కాక క్రమంగా కోలుకోవడం ప్రారంభించాడు. ఆరోగ్యం పూర్తిగా మెరుగు పడటంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాడు. 

ఈ క్రమంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎమ్‌ఈఆర్) డైరెక్టర్ ప్రొఫెసర్ జగత్ రామ్ మాట్లాడుతూ.. ‘ఇది ఖచ్చితంగా మనందరికి చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చే వార్త. ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన వైద్యులందరికి అభినందనలు. పీజీఐఎమ్‌ఈఆర్‌లో ప్లాస్మా థెరపీతో కోలుకున్న మొదటి వ్యక్తి ఇతను. కరోనాతో తీవ్ర అనారోగ్యానికి గురయిన వారికి ప్లాస్మా థెరపీని అందించాలని సూచిస్తారు. ఈ ప్రయత్నం విజయవంతం అయ్యింది. దీని గురించి మరింత ప్రచారం చేయాల్సి’ ఉంది అన్నారు. (పరమౌషధం కానున్న ప్లాస్మా!)

అనస్థీషియా అండ్‌ ఇంటెన్సివ్ కేర్ విభాగం డీన్ (అకాడెమిక్స్), హెడ్ ప్రొఫెసర్ జీడీ పూరి చికిత్స గురించి తెలుపుతు ‘ప్లాస్మా థెరపీతో  కోలుకోవడం సానుకూల సూచిక. ఈ చికిత్స క్లినికల్ ట్రయల్స్ కోసం ఎక్కువ మంది దాతలు ముందుకు రావల్సిన అవసరం ఉంది. కరోనా నుంచి కోలుకున్న రోగులను రక్త దానం చేసేలా ప్రోత్సాహించమని వారి కుటుంబ సభ్యులు, బంధువులను కోరుతున్నాం’ అన్నారు. ఆక్సిజన్ థెరపీ అవసరమయ్యే కరోనా పాజిటివ్ రోగులకు ప్లాస్మా చికిత్స అందించవచ్చని ఐసీఎమ్‌ఆర్‌ తెలిపింది. ట్రయల్స్‌ కోసం అది ఎంచుకున్న కేంద్రాల్లో పీజీఐ చంఢీగర్‌ను ఒకటి. ఈ క్రమంలో ‘ఏప్రిల్‌ చివరి వారంలో ఐసీఎమ్‌ఆర్‌ పీజీఐని ఎంచుకుంది. మే 9న మొదటి వ్యక్తి ప్లాస్మాను దానం చేశారు. జూన్ 1 న ప్లాస్మా థెరపీ పొందటానికి అర్హత సాధించిన మొదటి కరోనా రోగిని గుర్తించాం. చికిత్స అనంతరం అతడు పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యాడు’ అని పూరి తెలిపారు. (కరోనా చికిత్సపై కొత్త ఆశలు)

ప్లాస్మా థెరపీ అంటే..
కరోనా పేషంట్ల పాలిట ఆశాదీపంగా కనిపిస్తున్న ఈ ప్లాస్మా థెరపీలో.. కోవిడ్‌-19 నుంచి కోలుకున్న రోగి నుంచి ప్లాస్మా తీసుకుంటారు. దీన్ని ‘కన్వలేసెంట్ ప్లాస్మా’ అంటారు. కరోనా వైరస్‌ సోకిన మొదటి దశలో ఈ ప్లాస్మా థెరపీ చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. ప్లాస్మాలో ఉండే ప్రతిరోధకాల ద్వారా ఈ చికిత్స పనిచేస్తుంది. కరోనా నుంచి కోలుకున్న రోగులు మాత్రమే ప్లాస్మాను దానం చేయడానికి అర్హులు. వీరి నుంచి సేకరించిన ప్లాస్మాను బ్లడ్‌ బ్యాంకులో నిల్వ వుంచి తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌తో వచ్చే రోగుల చికిత్స కోసం వినియోగిస్తారు. 

మరిన్ని వార్తలు