ఫ్రీజర్‌లో స్వామీజీ..

17 Mar, 2014 00:32 IST|Sakshi
ఫ్రీజర్‌లో స్వామీజీ..

ఈయన పేరు అశుతోష్‌జీ మహారాజ్. దివ్యజ్యోతి జాగృతి సంస్థాన్ వ్యవస్థాపకులు. పంజాబ్‌లోని నూర్‌మహాల్ గ్రామంలో అశుతోష్‌జీకి పేద్ద ఆశ్రమమే ఉంది. వివాదాస్పదుడిగా పేరొందారు. విషయమేమిటంటే.. గత నెలన్నరగా ఈయన ఫ్రీజర్‌లో ఉన్నారు. అక్కడ ఈయనకేం పని అని అనుకుంటున్నారా? వాస్తవానికి ఈయన జనవరి 29న మరణించారు.

 

వైద్యులు ఈసీజీ సహా అన్ని పరీక్షలు చేసి.. గుండెపోటుతో అశుతోష్‌జీ మరణించినట్లు ప్రకటించారు. కానీ ఆశ్రమ నిర్వాహకులు, సన్నిహిత భక్తులు మాత్రం నమ్మలేదు. అశుతోష్‌జీ బతికే ఉన్నారని.. ఆయన ధ్యానంలోకి వెళ్లారని.. సమాధి స్థితిలో ఉన్నారని చెప్పారు. ఆయన తిరిగొచ్చేవరకూ శరీరం పాడవకుండా ఉండటానికి ఫ్రీజర్‌లో పెట్టారు. అప్పట్నుంచి అశుతోష్‌జీ ఫ్రీజర్‌లోనే ఉన్నారు. ఆయన తప్పక తిరిగొస్తారని, ఫ్రీజర్ నుంచి తమకు సందేశాలు కూడా పంపుతున్నారని ఆశ్రమ నిర్వాహకులు చెబుతున్నారు. దీనిపై ఓ వ్యక్తి హైకోర్టులో కేసు కూడా వేశారు. అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

 

అశుతోష్‌జీ క్లినికల్ డెడ్  అని చెప్పిన సర్కారు.. ఆయన శరీరాన్ని ఏం చేయాలన్నది ఆశ్రమం ఇష్టమని చెప్పి, చేతులు దులుపుకుంది. అయితే, ఆశ్రమం పేరిట 1,500 కోట్ల ఆస్తులున్నాయని.. అశుతోష్‌జీ చనిపోయేలోపు వారసుడి పేరును ప్రకటించనందున ఆ డబ్బంతా చారిటబుల్ ట్రస్టుకు వెళ్లిపోతుందని మీడియాలో కథనాలు వచ్చాయి. అందుకే ఆయన మరణించారన్న విషయాన్ని ప్రకటించడం లేదన్న వాదనా ఉంది. అయితే, అశుతోష్‌జీ తిరిగొస్తారని, వారసుడిని ప్రకటిస్తారని ఆశ్రమ నిర్వాహకులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు