ఐఐటీ విద్యార్థికి మోదీ స్పెషల్‌ గిఫ్ట్‌

4 May, 2018 13:54 IST|Sakshi
ఐఐటీ విద్యార్థి రబేశ్‌ కుమార్‌ (ఫైల్‌ ఫొటో)

ధన్‌బాద్‌ : ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ సోషల్‌ మీడియా ద్వారా ప్రజలకు దగ్గరగా ఉంటారు. తనకు కానుక ఇవాలని ఐఐటీ విద్యార్థి ఓ సోషల్‌ మీడియా ద్వారా అభ్యర్థించగా అతడి కోరికను మోదీ తీర్చారు. ఆ విద్యార్థి కోరిన కానుకతో పాటు, ఒక లేఖను కూడా పంపించారు. ఇప్పుడు ఆ విద్యార్థి ఆనందంలో మునిగి తేలుతున్నాడు. ఇంతకీ విషయమేమిటంటే.. పంచాయితీరాజ్‌ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ మధ్యప్రదేశ్‌కు వెళ్లారు. ఆ పర్యటనలో మోదీ బంగారు వర్ణంలో ఉన్న మాల ధరించారు.

మోదీ ఉపన్యాసాన్ని వినడానికి వచ్చిన రబేశ్‌ కుమార్‌ సింగ్‌ అనే విద్యార్థి ఆ మాలను చూసి ముచ్చటపడ్డాడు. అనుకున్నదే తడవుగా ఆ మాల తనకు కావాలంటూ ట్విటర్‌ వేదికగా మోదీకి తన మనసులోని మాట చెప్పాడు. ఇందుకు స్పందించిన మోదీ.. ప్రధాని కార్యాలయం (పీఎంవో) ద్వారా మాలతో పాటు, ఒక లేఖను కూడా పంపించారు. ‘ట్విటర్‌లో నీ మెసేజ్‌ చదివాను. పంచాయితీరాజ్‌ దినోత్సవం రోజు నేను ఆ మాల ధరించాను. ఇప్పుడు ఆ మాలతో పాటు ఈ లేఖను కూడా నీకు పంపిస్తున్నాను. నీవు మంచి భవిష్యత్తు పొందాలని ఆశిస్తున్నానంటూ’ రబేశ్‌కు మోదీ లేఖ రాశారు. కానుకను అందుకున్న రబేశ్‌.. ‘మీ నుంచి కానుకతో పాటు, లేఖ కూడా అందుకోవడం చాలా గౌరవంగా భావిస్తున్నాను. ఇంత మంచి బహుమతి, సందేశాన్నిచ్చిన మీకు కృతఙ్ఞతలు’ అంటూ ట్వీట్‌ చేశాడు.

మరిన్ని వార్తలు