అగస్టా రహస్యాలు బట్టబయలు..

5 Dec, 2018 15:11 IST|Sakshi

జైపూర్‌ : యూపీఏ హయాంలో జరిగిన అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కుంభకోణంలో దళారీ క్రిస్టియన్‌ మైఖేల్‌ నోటివెంట ఇప్పుడు రహస్యాలు బయటికొస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన బుధవారం ఓ ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మాట్లాడారు. అగస్టాలో రాజకీయ నేతలకు ముడుపులు ముట్టచెప్పిన మధ్యవర్తి మైఖేల్‌ను దుబాయ్‌ నుంచి భారత్‌ రప్పించామని, ఈ కుంభకోణంలో ఇప్పుడు రహస్యాలు బట్టబయలు కానున్నాయని అన్నారు.

మైఖేల్‌ వెల్లడించే అంశాలతో కేసు ఏ మలుపు తీసుకుంటుందో చూడాలన్నారు. కాగా, అగస్టా కేసుకు సంబంధించి మైఖేల్‌ను దుబాయ్‌ ప్రభుత్వం భారత్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సీబీఐ ఆయనను అరెస్ట్‌ చేసిన క్రమంలో మంగళవారం రాత్రి మైఖేల్‌ ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకువచ్చారు. మైఖేల్‌ను బుధవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం న్యాయమూర్తి అరవింద్‌ కుమార్‌ ఎదుట హాజరుపరిచారు.

కాగా, రూ.3600 కోట్లతో 12 వీవీఐపీ హెలికాప్టర్లు కొనేందుకు 2010, ఫిబ్రవరిలో నాటి యూపీఏ ప్రభుత్వం అగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. కాంట్రాక్టు నిబంధనలు ఉల్లంఘనకు గురవడంతో పాటు రూ.423 కోట్ల ముడుపులు చేతులు మారాయని, కేంద్ర ఖజానాకు సుమారు రూ.2666 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఆరోపణలు రావడంతో 2014 జనవరి 1న ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. హెలి కాప్టర్లు ఎగిరే ఎత్తు పరిమితిని 6 వేల మీటర్ల నుంచి 4500 మీటర్లకు తగ్గించి కొందరు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది. ఎత్తు తగ్గించడం ద్వారానే అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ ఒప్పందం చేసుకోవడానికి అర్హత సాధించిందని తెలిపింది. 

మరిన్ని వార్తలు