విశ్వ ఐక్యతా సూత్రం.. యోగా

22 Jun, 2018 02:15 IST|Sakshi
డెహ్రాడూన్‌లో జరిగిన కార్యక్రమంలో యోగా చేస్తున్న ప్రధాని మోదీ, చైనాలోని షియాన్‌లో ఆసనాలు వేస్తున్న యువతులు

సాధన చేస్తే ఆరోగ్యంతోపాటు సుఖశాంతులు

ఉత్తరాఖండ్‌ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని

ప్రపంచవ్యాప్తంగా ఘనంగా యోగా దినోత్సవం

డెహ్రాడూన్‌: ప్రపంచవ్యాప్తంగా నాలుగో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఉత్తరాఖండ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ 50 వేల మందికిపైగా ఔత్సాహికులతో కలసి యోగాసనాలు వేశారు. ఘర్షణలతో సతమతమవుతున్న ప్రపంచంలో ఐకమత్యం తీసుకొచ్చే శక్తి ఈ ప్రాచీన భారతీయ విద్యకు ఉందని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. ఆరోగ్యంతోపాటు, సుఖశాంతులతో నిండిన జీవితం కోసం ప్రజలంతా యోగా సాధన చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఉదయం ఆరున్నర గంటలకే డెహ్రాడూన్‌లోని ఫారెస్ట్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎఫ్‌ఆర్‌ఐ) క్యాంపస్‌కు చేరుకున్న మోదీ.. తొలుత ఔత్సాహికులను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం దాదాపు అర్ధగంటపాటు యోగాసనాలు వేసి ప్రాణాయామ సాధన చేశారు. అక్కడ మోదీ మాట్లాడుతూ ‘అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపునకు వెళ్లే దారిని చూపించి ప్రపంచ ప్రజల జీవన విధానాలను యోగా మెరుగుపరుస్తోంది. డెహ్రాడూన్‌ నుంచి డబ్లిన్‌ వరకు, షాంఘై నుంచి షికాగో వరకు, జకర్తా నుంచి జొహన్నెస్‌బర్గ్‌ వరకు.. హిమాలయ ప్రాంతమైనా, ఎండలు మండిపోయే ఎడారులైనా.. ఆయా ప్రాంతాల్లోని కోట్లాది మంది ప్రజల జీవన స్థితిగతులను యోగా మరింత ఉన్నతంగా మారుస్తోంది.

ప్రపంచ సమాజాల్లో స్నేహపూర్వక భావనను నెలకొల్పుతోంది. ఐకమత్యానికి ఆ భావనే ఆధారం’ అని పేర్కొన్నారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించే అద్భుతమైన కళగా మాత్రమే కాకుండా.. ప్రజలను, దేశాలను ఏకం చేసి, ప్రపంచంలో శాంతి, సౌభ్రాతృత్వాలు విరజిల్లేలా చేసే శక్తి యోగాకు ఉందన్నారు. దేశ ప్రజలు తమకు వారసత్వంగా వచ్చిన కళలు, విద్యను గౌరవించడం నేర్చుకోవాలనీ, అప్పుడే ప్రపంచం మనల్ని గౌరవిస్తుందని మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రశాంతమైన, సృజనాత్మకమైన, సంతృప్తికరమైన జీవనాన్ని సాగించాలంటే అందుకు సరైన మార్గం యోగానేనన్నారు. ‘వ్యక్తిగతంగానైనా, సామాజికంగానైనా.. మనం ఎదుర్కొనే అన్ని సమస్యలకూ యోగాలో అద్భుతమైన పరిష్కారం ఉంది. విభజించడానికి బదులుగా యోగా ఏకం చేస్తుంది. పగ, విద్వేషాలకు బదులు యోగా అందర్నీ కలుపుకుపోతుంది. నొప్పిని పెంచడానికి బదులు గాయాన్ని నయం చేస్తుంది. ప్రపంచానికి ఆశాకిరణంగా యోగా నిలుస్తోంది. యోగా విద్య ప్రాచీనమైనదైనప్పటికీ అది ఆధునికంగానే ఉంది. నిరంతరం పరిణామం చెందుతోంది’ అని మోదీ పేర్కొన్నారు.

సూరినామ్‌లో రాష్ట్రపతి..
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గురువారం సూరినామ్‌లో ఆ దేశ అధ్యక్షుడు డిజైర్‌ డెలానో బౌటర్స్‌తో కలసి యోగా సాధన చేశారు. రెండు దేశాల అధినేతలు కలసి యోగా సాధన చేయడం ఇదే తొలిసారని కోవింద్‌ ట్విట్టర్‌లో తెలిపారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో కూడా యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ బ్రస్సెల్స్‌లోని యూరోపియన్‌ పార్లమెంటు వద్ద పలువురు ఔత్సాహికులతో కలసి యోగా సాధన చేశారు.  

రాష్ట్రాల్లోనూ ఘనంగా యోగా
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోనూ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. బెంగళూరులో మాజీ ప్రధాని దేవెగౌడ ప్రధాని మోదీ ఫిట్‌నెస్‌ చాలెంజ్‌కు దీటుగా తన ఇంట్లోనే మీడియా ముందు యోగాసనాలు వేసి చూపించారు. మైసూరులోని రేసుకోర్సు మైదానంలో జిల్లా పాలక మండలి ఆధ్వర్యంలో 70 వేల మంది యోగా సాధన చేశారు. ఢిల్లీలో కేంద్ర మహిళా, శిశు సంరక్షణ శాఖ మంత్రి మేనకా గాంధీ గర్భిణులతో కలిసి యోగాసనాలు వేశారు. చండీగఢ్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పాల్గొన్నారు. అహ్మదాబాద్‌లో 750 మంది వికలాంగులతో కలసి గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ యోగా సాధన చేశారు. సిక్కిం, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్‌ జార్ఖండ్‌ తదితర రాష్ట్రాల్లోనూ ఘనంగా కార్యక్రమాలు జరిగాయి.

గైర్హాజరైన పలువురు సీఎంలు
యోగా దినోత్సవ కార్యక్రమాలకు పలువురు ముఖ్యమంత్రులు దూరంగా ఉన్నారు. బిహార్‌లో గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్, కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్, బిహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ మోదీ తదితరులు పాల్గొన్న కార్యక్రమానికి ఆ రాష్ట్ర సీఎం నితీశ్‌ కుమార్‌ హాజరుకాక పోవడం చర్చనీయాంశమైంది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఆరోగ్యం బాగాలేక పోవటంతో యోగా కార్యక్రమాల్లో పాల్గొనలేక పోయారు. పది రోజుల చికిత్స కోసం ఆయన బెంగళూరుకు వెళ్లారు. కర్ణాటకలోనూ ముఖ్యమంత్రి కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రి పరమేశ్వరలు యోగా కార్యక్రమాల్లో పాలుపంచుకోలేదు. పశ్చిమ బెంగాల్‌లో కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ యోగా కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.

యోగాకు మతం లేదు: క్రైస్తవ సన్యాసిని
తిరువనంతపురం: ఆమె ఓ క్రైస్తవ సన్యాసిని. ప్రతిరోజూ మోకాళ్లపై కూర్చుని చేతులు జోడించి బైబిల్‌ వాక్యాలను చదువుతుంది. అంతే నిష్ట, శ్రద్ధతో ప్రతిరోజూ సూర్య నమస్కారాలు, ప్రాణాయామ, యోగాసనాలను వందల మందికి బోధిస్తుంది. దీనిపై చర్చి సంఘాలు, వ్యక్తులు అభ్యంతరం వ్యక్తం చేసినా వెనక్కు తగ్గలేదు. ఆమే 67 ఏళ్ల ఇన్‌ఫ్యాంట్‌ ట్రెసా. నర్సుగా ప్రభుత్వోద్యోగం చేసిన ట్రెసా 2006లో పదవీ విరమణ పొందారు. 30 ఏళ్లుగా యోగా సాధన చేస్తున్న ఆమె.. ఉద్యోగం నుంచి బయటకు వచ్చిన తర్వాత తన జీవితాన్ని యోగా, ధ్యానానికి ప్రాచుర్యం కల్పించేందుకు అంకితం∙చేశారు. కేరళలో రెండు యోగా శిక్షణ కేంద్రాలు ప్రారంభించి వేలాది మందికి యోగా నేర్పుతున్నారు. తన శిక్షణ కేంద్రాల్లో హిందువులతోపాటు క్రైస్తవులు, ముస్లింలు కూడా యోగా నేర్చుకుంటున్నారని, యోగాకు మతంతో సంబంధం లేదని చెప్పారు.


                             లడక్‌లో మంచు కొండల్లో ఐటీబీపీ జవాన్ల యోగా సాధన
 

మరిన్ని వార్తలు